గన్నవరం విమానాశ్రయంలో ఏటీసీ టవర్ ప్రారంభం
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:30 AM
విజయవాడ సమీపంలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ అందుబాటులోకి వచ్చింది.
విజయవాడ నుంచి వారాణసీకి విమానాలు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
గన్నవరం, జూలై 18(ఆంధ్రజ్యోతి): విజయవాడ సమీపంలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.77 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) టవర్, టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్‌ను ఎంపీలు కేశినేని శివనాథ్(చిన్ని), బాలశౌరిలతో కలిసి పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమాన సర్వీసుల ఆపరేషన్‌లో ఏటీసీ భవనం అత్యంత కీలకమని, ప్రస్తుతం 40, 50 ఏళ్ల క్రితం నాటి పాత భవనం నుంచి సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. టెర్మినల్ భవన నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. విజయవాడ విమానాశ్రయాన్ని క్యాపిటల్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని, అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలని సీఎం చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని తెలిపారు. ‘‘ఆగస్టు 13 నుంచి విజయవాడ నుంచి వారాణసికి విమాన సర్వీసు ప్రారంభ కానుంది. ముంబై ఇతర ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభించే ఆలోచన చేస్తున్నాం’’ అని కేంద్ర మంత్రి వివరించారు.