ప్లాట్లు కాదు.. పాట్లు
ABN , Publish Date - Jun 23 , 2026 | 04:35 AM
చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే... గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో... అన్ని సదుపాయాలతో అంటూ.. పదేళ్ల క్రితం సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ బాలాజీ ఎవెన్యూ పేరుతో ఓ వెంచర్ వేశారు.
ఆదిత్య వెంచర్స్‌లో కొనుగోలుదారుల గగ్గోలు
పదేళ్ల క్రితమే గన్నవరం వద్ద అంపాపురంలో శ్రీబాలాజీ ఎవెన్యూ పేరిట వెంచర్
300 మందికి స్థలాల విక్రయం
కనీస సదుపాయాలు కల్పించకుండా టోకరా
స్థలాలు సైతం కనిపించని పరిస్థితి
(ఆంధ్రజ్యోతి-హనుమాన్‌జంక్షన్ రూరల్)
చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే... గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో... అన్ని సదుపాయాలతో అంటూ.. పదేళ్ల క్రితం సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ బాలాజీ ఎవెన్యూ పేరుతో ఓ వెంచర్ వేశారు. అక్కడ ఇళ్లు కట్టుకుంటే బాగుంటుందని కొందరు.. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని మరికొందరు స్థలాలు కొనుగోలు చేశారు. ఏపీతో పాటు తెలంగాణకు చెందిన వందలాది మంది మధ్యతరగతి ప్రజలు అప్పట్లో రూ.8 లక్షల నుంచి 10 లక్షల వ్యయంతో కొనుగోలు చేశారు. ఆదిత్య వెంచర్స్ యాజమాన్యం బాపులపాడు మండలం అంపాపురంలో శ్రీ బాలాజీ ఎవెన్యూ పేరుతో ఈ స్థలాలను సుమారు 300 మందికి అంటగట్టింది. పదేళ్లు గడచినా ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉందంటే... కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదు. కరెంటు, తాగునీటి సదుపాయాలు లేవు. ఎనిమిదేళ్లుగా నిర్వహణ లేదు. వెంచర్‌లో పచ్చిగడ్డి మొలచి పశువులకు మేతగా ఉపయోగపడుతోంది. స్థలాలు కొనుగోలు చేసిన వారికి అవి ఎక్కడున్నాయో కూడా తెలియని స్థితి. వెంచర్ మొత్తం కోడిపందేల బరిగా మారిపోయింది. సంక్రాంతి పండగ సమయంలో కోట్లు దండుకునేలా రాష్ట్రంలోనే అతిపెద్ద బరిగా మార్పు చెందిందంటే అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పాట్లు అర్థం చేసుకోవచ్చు. ఆదిత్య వెంచర్స్ యాజమాన్యం ప్లాట్లు అమ్మేసిన తర్వాత చేతులు దులుపుకొంది. ఇటీవల కొందరు ప్లాట్లు అమ్మేందుకు ప్రయత్నించగా... తాము కొనుగోలు చేసిన స్థలాల సరిహద్దులు కూడా లేకపోవడంతో పాటు కనీసం రహదారి సౌకర్యం లేదని వాపోయారు. పచ్చిగడ్డి, ముళ్లపొదలతో నిండిపోయి ఇళ్లు కట్టుకునేందుకు ఆస్కారం లేని పరిస్థితి నెలకొంది. వెంచర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీనికితోడు కొంత స్థలాన్ని వేరే వ్యక్తులకు ష్యూరిటీగా పెట్టినట్లు ఆరోపణలు రావడం ప్లాట్ల కొనుగోలుదారుల్లో గుబులు రేపుతోంది.
పేరు గొప్ప... వెంచర్ దిబ్బ
జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీబాలాజీ ఎవెన్యూ (ఆదిత్య వెంచర్స్) పేరుకు మాత్రమే గొప్ప. కనీస సదుపాయాలు లేక క్షేత్రస్థాయిలో ముళ్లపొదలతో దిబ్బలాగా తయారైంది. వెంచర్‌లో ప్రధాన రహదారి పక్కన స్థలాలు మినహా లోపల ఉన్న ప్లాట్లలో ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం లేదు. కొన్ని ప్లాట్లపై హైటెన్షన్ విద్యుత్ లైన్లు కూడా ఉన్నాయి. వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చే తమకు అమ్మారని కొందరు చెబుతున్నారు. కానీ పదేళ్లయినా వాటిని తొలగించలేదు. జాతీయ రహదారి విస్తరణతో చుట్టుపక్కల అంపాపురం, ఎ.సీతారాంపురం గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది. వెంచర్‌లో మాత్రం నిర్వహణ లేక పదేళ్ల క్రితం ప్రధాన రహదారి డివైడర్‌కు కట్టిన గోడలు కూడా పడిపోతున్నాయి.
సీఆర్‌డీఏ పరిధిలో ఉన్నా..
అంపాపురం సీఆర్‌డీఎ పరిధిలో ఉన్నా.. 30 ఎకరాల్లో లేఅవుట్ వేసి ప్లాట్లను అమ్మి సొమ్ము చేసుకున్నా సీఆర్‌డీఏ అధికారులకు మాత్రం పట్టడం లేదు. వెంచర్‌లో అక్రమాలపై కొందరు రైతులు.. పోలీసులు, సీఆర్‌డీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యం. అదే జీవనానికి జాతీయ రహదారి పక్కన చిన్నపాటి రేకులషెడ్డు వేసుకుంటే మాత్రం నోటీసులు ఇచ్చేందుకు ఆగమేఘాల మీద అధికారులు లేదా వారి వద్ద పనిచేసే వారు వస్తారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యాయపోరాటం దిశగా...
ఆదిత్య వెంచర్స్ అక్రమాలు ఇటీవల బయట పడటంతో కొందరు కొనుగోలుదారులు ఇటీవల సమావేశమయ్యారు. తమ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియని స్థితిలో తయారైన వెంచర్‌ను చూసి న్యాయపోరాటం చేద్దామని తీర్మానించారు. వీరిలో అత్యధికులు ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు.
చుట్టుపక్కల రైతులకూ చుక్కలు
వెంచర్ మొదలు పెట్టిన మొదట్లో చుట్టు పక్కల రైతులకు రహదారి సౌకర్యం ఇస్తామని ఆదిత్య యాజమాన్యం ఆశ చూపించింది. కాలక్రమంలో రహదారి సౌకర్యం కల్పించకపోగా రైతులు పొలాలకు వెళ్లే రహదారి కూడా మూసుకుపోయింది. తనకున్న 2.50 ఎకరాల పొలంలో కొంతభాగాన్ని ఆక్రమించి ప్లాట్లుగా అమ్మేశారని మోతుకూరి వెంకటేశ్వర రావు అనే రైతు వాపోయారు. తన కుమారుడు విదేశాల్లో ఉండటంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని పొలాన్ని ఆక్రమించారని ఆరోపించారు.