గంజాయి మత్తులో కర్ణాటక వాసి వీరంగం
ABN , Publish Date - Mar 18 , 2026 | 07:01 AM
గంజాయి మత్తులో కర్ణాటకవాసి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. సైకోలా వ్యవహరిస్తూ హల్‌చల్ చేశాడు.
పోలీసు వాహన డ్రైవరుపై దాడి.. కారు, ఆటో ఢీకొట్టి హల్‌చల్
గంగవరం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): గంజాయి మత్తులో కర్ణాటకవాసి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. సైకోలా వ్యవహరిస్తూ హల్‌చల్ చేశాడు. పోలీసు వాహన డ్రైవర్‌పై దాడి చేసి.. ఆ వాహనంతో కారు, ఆటోను ఢీకొట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. చిత్తూరు జిల్లా గంగవరంలో మంగళవారం ఈ ఘటన కలకలం రేపింది. బెంగళూరు సమీపంలోని మారసంద్ర ప్రాంతానికి చెందిన రత్నాకర్(36) ప్రైవేట్ డ్రైవర్. మంగళవారం వేకువజామున గంగవరం సమీపంలోని పంటపొలాల వద్ద శరీరంపై దుస్తుల్లేకుండా ప్రత్యక్షమయ్యాడు. రైతులు, మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, బెదిరిస్తుండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీస్ హైవే పెట్రోలింగ్ వాహనాన్ని తీసుకొని డ్రైవర్ ధనంజయ సంఘటనా స్థలానికి రాగా, రత్నాకర్‌ను స్థానికులు వాహనంలో కూర్చోబెట్టారు. ఈ క్రమంలో డ్రైవరుపై రాతిబండతో దాడిచేయబోగా అతను తప్పించుకున్నాడు. రత్నాకర్ పోలీస్ వాహనాన్ని వేగంగా నడిపి కారును, ట్రాలీ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనల్లో ఇద్దరు గాయపడ్డారు. అనంతరం సిమెంట్ ఫుట్‌పాత్‌ను ఢీకొనగా వాహనం ముందుకు కదలకపోవడంతో వదిలేసి పరుగుతీశాడు. స్థానికులపై రాళ్లు విసురుతూ ఓ చెరువులోకి దూకి, ముళ్లచెట్టును పట్టుకుని ఒకటిన్నర గంటపాటు ఉండిపోయాడు. అగ్నిమాపక అధికారులు తాళ్ల సాయంతో చెరువులో దిగి రత్నాకర్‌ను ఒడ్డుకు చేర్చారు. తాళ్లతో బంధించి పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంజాయి తీసుకున్నప్పుడల్లా ఇతడు సైకోలా వ్యవహరించేవాడని పోలీసులు తెలిపారు.