గ్రానైట్ కార్మికులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయం
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:48 AM
గ్రానైట్ పరిశ్రమలో పనిచేసే కార్మికులే లక్ష్యంగా ఒడిశా నుంచి తీసుకువచ్చిన గంజాయిని, గంజాయితో కూడిన చాక్లెట్లను బహిరంగంగా విక్రయిస్తున్న వ్యక్తిని ప్రకాశం జిల్లా ఎక్సైజ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లా బూదవాడలో పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
చీమకుర్తి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గ్రానైట్ పరిశ్రమలో పనిచేసే కార్మికులే లక్ష్యంగా ఒడిశా నుంచి తీసుకువచ్చిన గంజాయిని, గంజాయితో కూడిన చాక్లెట్లను బహిరంగంగా విక్రయిస్తున్న వ్యక్తిని ప్రకాశం జిల్లా ఎక్సైజ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద 800 గ్రాముల గంజాయి, 800 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చీమకుర్తి ఎక్సైజ్ పోలీ్‌సస్టేషన్‌లో సీఐ సుకన్య వివరాలను విలేకరులకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడ సమీపంలో కర్నూల్ రోడ్డుకి పక్కనే ఉన్న బ్యాంక్ వద్ద ఉన్న బడ్డీకొట్టులో ఒడిశాకు చెందిన ప్రశాంత్ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం అందింది. సీఐ సుకన్య, ఎస్‌ఐ నగేష్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్.. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని గంజాయి, గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం కోర్టులో హజరుపరచనున్నట్టు సీఐ సుకన్య తెలిపారు. గంజాయితో కూడిన చాక్లెట్ల కవర్‌పై ఆరోగ్యానికి మంచిది అన్నట్టు ఆయుర్వేద మూలికలతో తయారు చేసినట్టు ఉండటం గమనార్హం.