Share News

రాత్రంతా ఈదుతూనే ఉన్నాం..!

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:47 AM

సముద్రంలో రెండు రోజులపాటు చేపల వేట సాగించి... మరో గంటలో తీరం చేరతామనగా ఘోరం జరిగిందని, గంగవరం పోర్టు సమీపాన బోటు బోల్తా పడడంతో అయినవారంతా దూరమయ్యారని..

రాత్రంతా ఈదుతూనే ఉన్నాం..!

  • గంటలో ఇంటికి వెళ్లిపోతామనగా ప్రమాదం: కారె చిన్నా

  • బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల తక్షణ సాయం: అచ్చెన్న

విశాఖపట్నం, అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): సముద్రంలో రెండు రోజులపాటు చేపల వేట సాగించి... మరో గంటలో తీరం చేరతామనగా ఘోరం జరిగిందని, గంగవరం పోర్టు సమీపాన బోటు బోల్తా పడడంతో అయినవారంతా దూరమయ్యారని.. మృత్యుంజయుడు కారె చిన్నా వాపోయాడు. చైనా వాణిజ్య నౌక సిబ్బంది సాయంతో బోటు ప్రమాదం నుంచి బయటపడి.. కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు చిన్నా మంగళవారం విలేకరులతో మాట్లాడాడు. ‘శనివారం (ఈ నెల 4న) వేట పూర్తయింది. మధ్యాహ్నం రెండు గంటలకు నా భార్య మసేనమ్మకు ఫోన్‌ చేసి ఇంకో గంటలో హార్బర్‌కు వచ్చేస్తాం. చేపలు అమ్మేసి ఇంటికి వస్తానని చెప్పాను. కానీ.. మూడు గంటలకు పెద్ద అల రావడంతో మా బోటు తిరగబడిపోయింది. మా అన్నయ్య మేడ అమ్మోరు కొడుకు చిన్నయ్య (చంటి) అందులో ఉండిపోయాడు. అన్నయ్య, నేను ఇద్దరం బాగా ఏడ్చాం. ఏడుగురిలో మిగిలిన ఆరుగురం క్షేమంగా ఇంటికి చేరితే చాలనుకున్నాం. ఫోన్లన్నీ సముద్రంలో పడిపోయాయి. తిరగబడిన బోటు మీదే అంతా కూర్చున్నాం. రాత్రి తొమ్మిది గంటలయ్యేసరికి అది మునిగిపోవడం మొదలైంది. అప్పటికే మాలో మరొకరు గల్లంతయ్యారు. బోటు మునిగిపోవడంతో మిగిలిన ఐదుగురం రాత్రంతా ఈదుతూనే ఉన్నాం. ఉదయం నాలుగు గంటలకు దూరంగా షిప్‌ కనిపించింది. అంతా అటు వైపు వెళితే వారు రక్షిస్తారని మా వాళ్లకు చెప్పాను. అయితే ఇక ఈదలేనని ఒకడు ఉండిపోయాడు.


మిగిలిన నలుగురం ఈదుకుంటూ వెళ్లాం. వారికీ, నాకూ మధ్య దూరం పెరిగింది. షిప్‌ దగ్గరకు వెళ్లి యాంకర్‌ పట్టుకుంటే.. అది విసిరేసింది. చచ్చిపోయాననుకున్నా. మళ్లీ తేరుకొని ఒంటి మీద బనియన్‌ తీసి తిప్పుతూ రక్షించాలని కేకలు వేశాను. షిప్‌ సిబ్బంది చూసి లైఫ్‌ జాకెట్‌ విసిరారు. అది పట్టుకొన్నాక, జాలీ వేసి పైకి లాగారు. వారు నాకు అన్నం పెట్టి లోపలకు తీసుకువెళ్లారు. ఆతర్వాత నేవీ వాళ్లు ఒడ్డుకు చేర్చి ఆస్పత్రిలో చేర్చారు. పెద్ద అల రాకపోయి ఉంటే క్షేమంగా వచ్చేవాళ్లం. మేమంతా ఒక కుటుంబ సభ్యులమే. మూడు నెలలు కష్టపడి, 30 లక్షల అప్పు చేసి బోటు తయారు చేసుకున్నా. ఇప్పుడది సముద్రంలో కలిసిపోయింది. ప్రభుత్వం ఆదుకోకపోతే రోడ్డున పడతాం’ అని వాపోయాడు. కాగా, గల్లంతైన మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆచూకీ తెలియని ఆరుగురి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ను ఆదేశించామని తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 05:48 AM