Share News

‘గంగమ్మ’ రాస్తున్న మరణ శాసనం

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:29 AM

పోలీసులకు పట్టుబడి కోర్టు మెట్లు ఎక్కాల్సిన బాలికల రేపిస్టుల జీవితాలు నీళ్లల్లో ముగిసి పోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కీచకులకు ‘గంగమ్మ’ మరణ శాసనం లిఖిస్తోంది.

‘గంగమ్మ’ రాస్తున్న మరణ శాసనం

  • నీళ్లలో తేలుతున్న రేపిస్టులు

  • మైలవరం డ్యామ్‌లో రహమతుల్లా.. తునిచెరువులో నారాయణ

  • తాజాగా ‘మదనపల్లె’ చెరువులో తేలిన కులవర్ధన్‌

  • ఆడపిల్లల జోలికొస్తే ఊరుకోబోమని సీఎం హెచ్చరికలు

  • ఘటనలపై జనం ఆగ్రహావేశాలు.. అనూహ్యంగా కడతేరుతున్న కీచకులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలీసులకు పట్టుబడి కోర్టు మెట్లు ఎక్కాల్సిన బాలికల రేపిస్టుల జీవితాలు నీళ్లల్లో ముగిసి పోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కీచకులకు ‘గంగమ్మ’ మరణ శాసనం లిఖిస్తోంది.రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వ్యక్తులు జైల్లో చిప్పకూడు తింటుంటే, మైనర్లపై దారుణాలకు తెగబడుతున్న రేపిస్టులు కడతేరిపోతున్నారు. ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే ఆఖరి రోజు అంటూ ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలు.. మరోవైపు ఆగ్రహావేశాలతో ప్రజలు రోడ్డెక్కుతుండటంతో రేపిస్టుల గుండెలు జారిపోతున్నా యి. అనూహ్యంగా వారి జీవితాలు గంగ లో కలిసిపోతున్నాయి. మదనపల్లిలో ఇంటి ముందు ఆడుకొంటున్న ఏడేళ్ల బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి కులవర్ధన్‌ అత్యాచారం చేసి, చంపేశాడు. డ్రమ్ము లో ఆ చిన్నారి శవాన్ని దాచిపెట్టాడు. పోలీసులు అదుపులోకి తీసుకోగా, అంగళ్లు సమీపంలోని చెరువులో కులవర్ధన్‌ శవమై కనిపించాడు. ఈ విషయం మీడియాకు అన్నమయ్య జిల్లా ఎస్పీ వెల్లడించారు.


మూడేళ్ల బాలికపై దారుణం

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని మైలవరం మండలం కంబాల దిన్నె గ్రామంలో గత ఏడాది మే 23న స్థానిక కల్యాణ మండపం వెనుక మూడేళ్ల బాలిక శవం తీవ్ర గాయాలతో కనిపించింది. తల్లితండ్రులతో కలిసి బంధువుల పెళ్లికి వచ్చిన ఆ బాలికను రహమ తుల్లా(26) అనే వ్యక్తి అరటి పండు ఇస్తానంటూ కల్యాణ మండపం వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినట్లు తేలింది. లైంగిక నేరాల నుంచి మైనర్లను రక్షించే(పోక్సో) చట్టం తో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నివారణ చట్టం కింద కేసు నమోదు చేసి రహమతుల్లాను అదుపులోకి తీసుకున్నారు. కోపోద్రికులైన ప్రజలు కామాంధుడి స్వగ్రామమైన మోరగుడిలో అతని ఇంటిని కూల్చేశారు. విషయం తెలిసిన వెంటనే శాంతి భద్రతల్ని పరిరక్షించేందుకు పోలీసులు అటు వెళ్లగా, రేపిస్ట్‌ పారిపోయాడు. గాలింపు చేపట్టిన పోలీసులకు మైలవరం డ్యామ్‌లో రహమతుల్లా శవం జూన్‌ 5న లభ్యమైంది.


తాతయ్య వయసులో పాడు పని

కాకినాడ జిల్లా తుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ తోటలో వృద్ధుడు నారాయణ రావు(63)... పదమూడేళ్ల బాలికతో అభ్యంతర కర స్థితిలో ఉన్న వీడియో ఒకటి 2025 అక్టోబరు చివరి వారంలో సోసల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నారాయణ రావు తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లి అక్టోబరు 22న తుని రూరల్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై రేప్‌, కిడ్నాప్‌, ఫోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అదే రోజు రాత్రి పది గంటల సమయంలో జడ్జి ముందు ప్రవేశ పెట్టేందుకు తీసుకెళుతున్నారు.మార్గం మధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవాలంటూ నారాయణరావు వాహనం దిగి అక్కడున్న కోమటి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రేపిస్టులకు ‘మృత్యు’దండనే.

  • అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండపాలెంలో జూలై 2024లో మైనర్‌ బాలికను సురేశ్‌ అనే యువకుడు హత్య చేశాడు. అప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భయపడ్డ నిందితుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  • గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్‌ బాలికపై సుబ్బయ్య(55) అఘాయిత్యానికి పాల్పడి ఇంటి వద్ద దించి వెళ్లాడు. 2018లో జరిగిన ఘటనపై ప్రజలు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ప్రత్యేక పోలీసు టీమ్‌లు రంగంలోకి దిగాయి. దీంతో భయప డిపోయి చెట్టుకు ఉరి వేసుకున్న సుబ్యయ్య శవాన్ని రెండు రోజుల తర్వాత పోలీసులు గుర్తించారు.


నాడు ఆడబిడ్డలకు నరకమే..

మహిళలపై అత్యాచారానికి పాల్పడితే 21రోజుల్లోని ఉరిశిక్ష అంటూ ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌ ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క ఉరిశిక్ష కూడా వేయించలేక పోయారు. కనీసం తాను గొప్పగా ప్రకటించిన దిశ చట్టాన్ని కూడా తీసుకు రాలేక పోయారు. ఆఖరికి తన ప్యాలె్‌సకు సమీపంలోని కృష్ణా నది తీరంలో కాబోయే భర్త ముందే యువతిపై అత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడిని అరెస్టు చేయలేక పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆడబిడ్డల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అంటోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరికల్ని ‘గంగమ్మ’ అమలు చేస్తుండటం గమనార్హం. మరో వైపు ఫోక్సో కేసులు, అత్యాచార కేసుల్లో శిక్షల శాతం బాగా పెరిగిందని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా చెబుతున్నారు. నేరాలకు కారణమైన గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం పోలీసులకు అందించాలని కోరారు.


  • రేపిస్టులు బయట ఉండేందుకు అనర్హులు

  • చిన్నారులు, మహిళల జోలికొస్తే సహించం

  • డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా హెచ్చరిక

  • కూటమి వచ్చిన 588 రోజుల్లో 524 శిక్షలు..

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 588 రోజులైతే.. చిన్నారులు, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసుల్లో 524 శిక్షలు పడ్డాయి. అందులో ఏడుగురికి మరణ శిక్షలు..138 మందికి యావజ్జీవం విధించిన కోర్టులు.. 119 కేసుల్లో 20నుంచి 25ఏళ్ల జైలు శిక్షలు విధించాయి. ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్లు విధించిన శిక్షలు 370 దాకా ఉన్నాయి. విజయనగరం జిల్లా 50కి పైగా కేసుల్లో శిక్షలతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌, ఏలూరు జిల్లా, పీఎ్‌సఆర్‌ నెల్లూరు, విశాఖపట్నం కమిషనరేట్‌ ఉన్నాయి. ఈ విషయమై డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పోక్సో కేసుల్లో స్పీడ్‌ ట్రయల్‌ మానిటరింగ్‌ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 164 శక్తి బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం మహిళలకు భద్రత కల్పిస్తున్నామని.. డయల్‌ 112, శక్తి యాప్స్‌కు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ యూనిట్లు క్షణాల్లో స్పందిస్తున్నాయని చెప్పారు. బాధితులు శక్తి వాట్సాప్‌ 79934 85111 కు ఫిర్యాదు చేస్తే బాధితులు లైవ్‌, సేఫ్‌ ట్రాకింగ్‌ సదుపాయాలు పొందవచ్చని సూచించారు.

Updated Date - Feb 19 , 2026 | 03:33 AM