Share News

గంగా-కావేరీ రూట్‌ మారుతోంది!

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:34 AM

గంగా-కావేరి నదుల అనుసంధాన మార్గం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా.. ఒడిసాలోని మహానది నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి వరకు అనుసంధానం జరపాలని ఆంధ్ర ప్రభుత్వం సూచిస్తోంది.

గంగా-కావేరీ రూట్‌ మారుతోంది!

  • ఇందులో భాగంగా మహానది-గోదావరి నదుల అనుసంధానం

  • మహానది నుంచి బహుదా వరకు..అక్కడి నుంచి పోలవరం దాకా

  • ఉత్తరాంధ్రలోని నీటి వనరులన్నిటిలో ప్రవాహం

  • ఆ తర్వాత పోలవరం నుంచి నల్లమలసాగర్‌ మీదుగా కావేరికి తరలింపు

  • ఎన్‌డబ్ల్యూడీఏ డిజైన్‌కు జలవనరుల శాఖ ప్రత్యామ్నాయం

  • అనుసంధానానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం సంసిద్ధత

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గంగా-కావేరి నదుల అనుసంధాన మార్గం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా.. ఒడిసాలోని మహానది నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి వరకు అనుసంధానం జరపాలని ఆంధ్ర ప్రభుత్వం సూచిస్తోంది. మహానది నుంచి ఆ రాష్ట్రంలోనే బహుదా నది వరకు.. అక్కడి నుంచి పోలవరం రిజర్వాయర్‌ వరకు అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ తాజాగా ప్రతిపాదించింది. మహానది-గోదావరి అనుసంధానంపై కేంద్ర జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డీడబ్ల్యూఏ) రూపొందించిన డిజైన్లతో ఒడిసా, ఆంధ్ర రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని.. 179 టీఎంసీల నీటిని కొండలూ, కోనలనూ దాటించి ధవళేశ్వరం బ్యారేజీలోకి తరలించడం వల్ల లాభం ఉండదని.. దీనికి తాము ప్రత్యామ్నాయ మార్గాన్ని చెబుతామని గత నెల ఐదో తేదీన హైదరాబాద్‌లో జరిగిన ఎన్‌డీడబ్ల్యూఏ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ తెలిపింది. పది రోజుల్లో ఆ ప్రత్యామ్నాయం పంపాలని ఎన్‌డీడబ్ల్యూఏ సూచించింది. ఒడిసా నుంచి రాష్ట్రానికి మహానది జలాలను తరలించేందుకు మధ్యలో సొరంగాలు తవ్వాల్సి వస్తే తాము అనుమతులిస్తామని.. ఈ అనుసంధానానికి రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టడానికైనా సిద్ధమని స్పష్టం చేసింది. దరిమిలా జలవనరుల శాఖ అంతర్రాష్ట్ర విభాగం బుధవారం సదరు అనుసంధాన ప్రత్యామ్నాయానికి తుది రూపమిచ్చింది. ఒడిసాలోని గజపతి జిల్లా రామగిరి కొండల్లో పుట్టిన బహుదా నది నుంచి పోలవరం దాకా మహానది-గోదావరి నదుల అనుసంధానం జరపాలని చీఫ్‌ ఇంజనీర్‌ సుగుణాకరరావు బృందం ప్రతిపాదించింది. మ్యాపులతో కూడిన అలైన్‌మెంట్‌ను ఈఎన్‌సీకి బుధవారమే సమర్పించింది. ఇది ఒడిసా, ఏపీలకు మేలు చేకూరుస్తుందని తెలిపింది.


రూట్‌మ్యాప్‌ ఇలా..

ఎన్‌డీడబ్ల్యూఏ మహానది జలాలను సీలేరు గుండా ఉత్తరాంధ్ర మీదుగా ధవళేశ్వరానికి తరలించాలని ప్రతిపాదించగా.. ఏపీ మాత్రం దానివల్ల ఆయకట్టు పెరగదని స్పష్టం చేసింది. మహానది జలాలను తొలుత బహుదా నదిలోకి తరలించాలని తన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలో సూచించింది. బహుదా ఏపీలోని ఇచ్ఛాపురానికి అతి సమీపాన ఉంటుంది. నేరుగా ఇచ్ఛాపురంలోనే ప్రవహిస్తుంటుంది. ఇక్కడి నుంచి నీటిని మందస మండలం మకరజోల వరకు 32 కిలోమీటర్లు తరలించాలని ఏపీ ప్రతిపాదించింది. మకరజోల నుంచి సునంద (8 కిమీ), సునంద-టెక్కలిపట్నం ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ (10 కిమీ), ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌-మహేంద్ర తనయ (17కిమీ), మహేంద్రతనయ-గొట్టా బ్యారేజీ (27 కిమీ), గొట్టా బ్యారేజీ-హిరమండలం (3కిమీ), హిరమండలం-జంఝావతి (65 కిమీ), జంఝావతి-ఆండ్ర (చంపావతి) రిజర్వాయర్‌ (63 కిమీ), ఆండ్ర రిజర్వాయర్‌-గోస్తని (40 కిమీ), గోస్తని-వీరనారాయణపురం (10కిమీ), వీరనారాయణపురం-రైవాడ రిజర్వాయర్‌ (18 కిమీ), రైవాడ-తాండవ రిజర్వాయర్‌ (70 కిమీ), తాండవ-ముసురుమల్లి (109 కిమీ), ముసురుమల్లి నుంచి పోలవరం వరకు 14 కిమీ... మొత్తం 486 కిలోమీటర్ల మేర తరలించాలని సూచించింది. ఆ తర్వాత పోలవరం నుంచి గోదావరి జలాలను నల్లమలసాగర్‌ మీదుగా కావేరికి తరలించాలని ప్రతిపాదించింది. ఈ ప్రత్యామ్నాయ పథకంతో రాష్ట్రంలోని సాగునీటి వనరులన్నింటిలో మహానది, గోదావరి జలాలు ప్రవహిస్తాయని.. దీనివల్ల ఒడిసా, ఏపీలకు బహుళ ప్రయోజనం ఉంటుందని అంతర్రాష్ట్ర విభాగం తెలిపింది. ఈ ప్రతిపాదనకు ఎన్‌డబ్ల్యూడీఏ సమ్మతిస్తే.. గంగా-కావేరీ అనుసంధాన పథకంలో భాగంగా ఒడిసా, ఆంధ్ర రాష్ట్రాల మధ్య మహానది-గోదావరి అనుసంధానం కార్యరూపం దాలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Updated Date - Jul 02 , 2026 | 03:34 AM