గాడిదకు బదులు గుర్రం మాంసం!
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:51 AM
గాడిద మాంసం పేరుతో గుర్రం మాంసం విక్రయిస్తున్న ముఠాను ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన ఒంగోలు పోలీసులు
మూడు జిల్లాల్లో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తింపు
ఒంగోలు క్రైం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): గాడిద మాంసం పేరుతో గుర్రం మాంసం విక్రయిస్తున్న ముఠాను ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని మూడు గుర్రాలు, మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ఆటోలు, ఒక కారును సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కొందరు వ్యక్తులు బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో గుర్రాలను కొనుగోలు చేసి, ఒంగోలుకు తరలించి వాటిని వధిస్తున్నారు. ఈ మాంసాన్ని ఒంగోలుతోపాటు మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ విక్రయిస్తున్నారు. చాలా రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారంపై అందిన సమాచారంతో స్థానిక తాలూకా పోలీసులు ఆదివారం తెల్లవారుజామున నగర శివారు మంగమూరు రోడ్డులోని దత్తగణపతి నగర్‌లో దాడి చేయడంతో గుట్టురట్టయ్యింది. గుర్రాలను వధించడం చట్టరీత్యా నేరమని, గుర్రాల మాంసాన్ని గాడిద మాంసం అని చెప్పి విక్రయిస్తూ మోసం చేస్తున్నారని తాలూకా ఎస్సై చౌడయ్య చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మార్కెట్‌లో గాడిద మాంసానికి డిమాండ్!
మార్కెట్‌లో గాడిద మాంసానికి డిమాండ్ ఉంది. దాన్ని తినడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది భావిస్తుంటారు. ప్రస్తుతం గాడిదలు దొరకడం కష్టంగా ఉంది. గుర్రాలు అయితే తక్కువ ధరకు రావడంతో పాటు వాటి బరువు కూడా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు గాడిద ధర ఒక్కటి రూ.40 వేలు ఉంటే గుర్రం రూ.15 వేలకు వస్తుంది. రేసులకు పనికిరాని (హైబ్రిడ్) గుర్రాలను చెరుకుపల్లిలో విక్రయిస్తుంటారు. వీటిని (ఒక్కో గుర్రానికి 60-70 కిలోల మాంసం వస్తుంది) కొనుగోలు చేస్తున్న ముఠా.. కేజీ మాంసాన్ని రూ.600 నుంచి రూ.700కు విక్రయిస్తున్నారు.