గ్యాంగ్ లీడర్‌ను తప్పించారు!
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:52 PM
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ఒక వైపు జిల్లా అధికారులు ప్రయత్నిస్తుంటే మరో వైపు స్థానిక అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గంగూరు గోడౌన్లపై మొక్కబడిగా దాడులు చేసిన అధికారులు 2500 బస్తాల నిల్వలను గుర్తించారు. సమీపంలోనే ఉన్న మరో మూడు వేల బస్తాలను వదిలేశారు. రేషన్ దందా నిర్వహిస్తున్న గ్యాంగ్ లీడర్, పెనమలూరు నియోజకవర్గ హిడెన్ డాన్‌ను వదిలేసి ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- రేషన్ మాఫియాకు కొమ్ముకాస్తున్న స్థానిక అధికారులు!
- ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొక్కుబడిగా తనిఖీలు
- 2500 బస్తాల నిల్వలు గుర్తించి మరో 3 వేల బస్తాలు వదిలేశారు!
- రేషన్ దందా నడిపే వారిని తప్పించి అనుచరులపై కేసులు
- పెనమలూరు హిడెన్ బాస్‌కు అందరితో సత్ససంబంధాలు!
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ఒక వైపు జిల్లా అధికారులు ప్రయత్నిస్తుంటే మరో వైపు స్థానిక అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గంగూరు గోడౌన్లపై మొక్కబడిగా దాడులు చేసిన అధికారులు 2500 బస్తాల నిల్వలను గుర్తించారు. సమీపంలోనే ఉన్న మరో మూడు వేల బస్తాలను వదిలేశారు. రేషన్ దందా నిర్వహిస్తున్న గ్యాంగ్ లీడర్, పెనమలూరు నియోజకవర్గ హిడెన్ డాన్‌ను వదిలేసి ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
పెనమలూరు నియోజకవర్గం గంగూరులోని ప్రైవేటు గోడౌన్లలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. వీటిని ఇక్కడ నిల్వ చేసిన వ్యక్తిని రెవెన్యూ, సివిల్ సప్లయిస్, పోలీస్ అధికారులు చాలా తెలివిగా తప్పించేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారం మేరకు తప్పక గంగూరు గోడౌన్లకు తనిఖీలకు వెళ్లిన సివిల్ సప్లయిస్ అధికారులు మొక్కుబడిగా సహాయకులపై కేసులు నమోదు చేశారన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సివిల్ సప్లయిస్ అధికారులు ఎవరైతే గోడౌన్ల యజమానులుగా చెబుతూ కేసులు నమోదు చేశారో.. వారు అసలు యజమానులే కాదు. యజమానులు వేరే వారు ఉన్నారు. ఈ విషయాన్ని దాచి సివిల్ సప్లయిస్ అధికారులు గ్యాంగ్ లీడర్ సహాయకులను యజమానులుగా చిత్రీకరిస్తూ మీడియాకు సైతం తప్పుడు సమాచారం అందించారు. అసలు యజమానులతో గ్యాంగ్ లీడర్ ఒప్పందం చేసుకుని అద్దెకు తీసుకోవటం జరిగింది. అద్దెకు తీసుకున్న గోడౌన్లలో ప్రస్తుతం కేసులు నమోదైన ఇద్దరూ కేవలం పర్యవేక్షిస్తున్నారు. ఈ గోడౌన్ల యజమానులను విచారిస్తే ఎవరికి అద్దెకు ఇచ్చారో తెలుస్తుంది. అలాగే కేసులు నమోదు చేసిన పర్యవేక్షకులను లోతుగా విచారించినా ఎవరు ఈ గోడౌన్లను తీసుకున్నారు ? ఎవరు మిమ్మల్ని నియమిచారు ? ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారన్న మూడు ప్రశ్నలకు సమాధానం రాబట్టగలిగితే గ్యాంగ్ లీడర్ ఎవరో తెలిసిపోతుంది. ఈ పని చేయటం లేదు. దీని వెనుక పెద్ద కథ ఉందని తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్ ఎవరో, అతని వెనుక ఉన్న రాజకీయ అంగ, అర్ధ బలం ఏమిటో రెవెన్యూ, సివిల్ సప్లయిస్, పోలీసులకు బాగా తెలియటంతో పాటు గ్యాంగ్ లీడర్‌తో తమకు ఉన్న ఆర్థిక వ్యవహారాలు కూడా బయట పడతాయన్న ఉద్దేశ్యంతోనే మిన్నకుండిపోతున్నారని సమాచారం.
పట్టుకున్నది 2,500 రేషన్ బస్తాలే..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేసిన రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు గుర్తించింది.. గోడౌన్లలో ఉన్న నిల్వలను మాత్రమే. దాడులకు వస్తున్నారన్న సమాచారం గ్యాంగ్‌కు లీక్ కావడంతో.. అప్రమత్తమై రెండు లారీలను దాచినట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రైవేటు గోడౌన్లను మరికొందరు అద్దెకు తీసుకున్నారు. వేర్వేరు సరుకు వీటిలో నిల్వ ఉంటుంది. ఎప్పటి కప్పుడు లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తుంటారు. సివిల్ సప్లయిస్ అధికారులు వస్తున్నారన్న సమాచారంతో మూడు వేల బస్తాలతో కూడిన మరో రెండు లారీలను ఇతర సరుకులను లోడింగ్, అన్‌లోడింగ్ చేసే వాహనాల మధ్యన పెట్టినట్టు తెలుస్తోంది. రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు కేవలం గోడౌన్లలో ఉన్నసరుకునే తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు.
- మరో 4 గోడౌన్లను ఎందుకు వదిలేశారు?
రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో గంగూరులో రెండు గోడౌన్లను తనిఖీ చేసిన రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు మరో నాలుగు గోడౌన్లను కూడా గ్యాంగ్ లీడర్ అద్దెకు తీసుకున్నారని తెలిసి కూడా వాటి వంక కన్నెత్తి చూడలేదు. పక్కా సమాచారంతో వచ్చిన వారికి ఇవి తెలియకపోవటం గమనార్హం. కేసులు రాయాలి కాబట్టి మొక్కుబడిగా తనిఖీలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి.
సెంట్రల్, పశ్చిమల నుంచి భారీగా తరలింపు
గంగూరులో పట్టుబడ్డ రేషన్ బియ్యం అంతా కూడా విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల నుంచే సేకరించినట్టు తెలిసింది. నగరం నుంచి రాము, సుబ్బారావు, దుర్గా ప్రసాద్ తదితరుల ద్వారా ఈ రేషన్ బియ్యం బస్తాలను గంగూరుకు తరలించినట్టుగా సమాచారం.
అనుమానం రాకుండా ప్రత్యేక వాహనాలలో రవాణా!
రేషన్ బస్తాలను రవాణా చేసే స్టయిల్ కూడా మార్చారు. గతంలో మాదిరిగా వ్యాన్లలో వేసి.. కవర్లు కట్టే సంస్కృతి ఇప్పుడు లేదు. ఓమ్ని వ్యాన్ల తరహాలో ఉండే కార్లలో సీట్లను తొలగించి రేషన్ బస్తాలను తరలిస్తున్నారు. లోపల ఉన్న బియ్యం బయటకు కనిపించకుండా ఉండటానికి అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేస్తున్నారు. ట్రక్ అంతా రేకుతో క్యాబిన్‌గా కవర్ అయిన మినీ కార్గోవాహనాలలో బియ్యం బస్తాలను తరలిస్తున్నారు. గంగూరుకు ఇలాంటి వాహనాలలోనే రేషన్ బియ్యం బస్తాలు వచ్చాయి.