Agricultural Innovation: ఉద్యానరంగంలో గేమ్ చేంజర్ ఆటోమేషన్!
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:45 AM
నీరు వృథా కాకూడదు.. విద్యుత్, సమయం ఆదా అవ్వాలి.. రైతులు అధిక సామర్థ్యం, ఉత్పాదకత, స్థిరత్వం సాధించాలి.. చివరికి పెట్టుబడులు తగ్గాలి..
సూక్ష్మసేద్యంలో సరికొత్త విధానం
మొబైల్ ఆపరేటింగ్ ద్వారా ఎక్కడి నుంచైనా తోటలకు నీరు పెట్టొచ్చు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నీరు వృథా కాకూడదు.. విద్యుత్, సమయం ఆదా అవ్వాలి.. రైతులు అధిక సామర్థ్యం, ఉత్పాదకత, స్థిరత్వం సాధించాలి.. చివరికి పెట్టుబడులు తగ్గాలి.. అధిక దిగుబడులతో రైతులకు స్థిరమైన ఆదాయం రావాలి.. ఉద్యానవనాల సాగులతో ఆటోమేషన్ విధానంతో ఇదంతా సాధ్యమే! పండ్ల తోటలకు వినియోగించే సూక్ష్మనీటి పారుదలలో ఉద్యానశాఖ ఇలాంటి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఏపీ సూక్ష్మనీటి పారుదల ప్రాజెక్ట్ ద్వారా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి వినూత్నంగా ఆటోమేషన్ ఆధారిత సూక్ష్మనీటి పారుదల వ్యవస్థను అమలు చేస్తోంది.
ఇదీ ఆటోమేషన్ విధానం!
నీరు వృథా కాకుండా, సమయం ఆదా అయ్యేలా, మొబైల్ ఆపరేటింగ్ ద్వారా ఎక్కడి నుంచైనా తోటలకు నీరు పెట్టేలా ఆటోమేషన్ విధానం ఉంటుంది. ఇది ఆధునిక వ్యవసాయ విధానంలో గేమ్ చేంజర్ అవుతోంది. దీనివల్ల రైతులు అధిక సామర్థ్యం, ఉత్పాదకత, స్థిరత్వం సాధించగలుగుతారు. ఈ విధానంలో షెడ్యూల్ చేయడం, పర్యవేక్షించడం, అవసరాల ఆధారంగా పంటలకు నీటిని సమర్థంగా అందించడం వంటివి ఉంటాయి. తోటలకు నీటిని సకాలంలో, కచ్చితమైన, తగినంత అందించడంతో పాటు మనుషులతో పని లేకుండా, రియల్‌టైమ్‌లో పనిచేసే సోలేనోయిడ్ వాల్వ్‌లు, స్మార్ట్ సెన్సార్లు, కంట్రోలర్ వంటి పరికరాలు ఉంటాయి.
ఎరువుల వాడకాన్ని ఆటోమేషన్ చేయడం ద్వారా ఫర్టిగేషన్ సామర్థ్యాన్ని పెంచుతాయి. దీనివల్ల ఉద్యాన పంటల్లో నాణ్యమైన ఉత్పత్తుల స్థిరత్వం మెరుగుపడుతుంది. విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా రైతుకు పెట్టుబడి తగ్గి, నికరాదాయం పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ మార్చిలోగా సూక్ష్మసేద్యంలో ఆటోమేషన్ విధానాన్ని 7,500హెక్టార్లలో అమలుచేయాలని ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆటోమేషన్ పరికరాల సరఫరాకు కొన్ని కంపెనీలను ఎంపిక చేశారు. ఆటోమేషన్‌కు హెక్టారుకు రూ.40వేలు ఖర్చవుతుంది. చిన్న, మధ్యస్థ, ఎస్సీ,ఎస్టీ రైతులకు హెక్టారుకు 55 శాతంతో రూ.22వేల వరకు సబ్సిడీ లభించనుంది. ఇతర రైతులకు 45శాతంతో రూ.18వేలు సబ్సిడీ ఉంటుందని ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
ఆటోమేషన్‌లో ఉండే ప్రధాన భాగాలు
పంపు స్టార్ట్ రిలే, ఓల్టేజ్ స్టెబిలైజర్, కంట్రోలర్లు, ప్లో డిడక్షన్ సెన్సార్, సోలేనాయిడ్ వాల్వ్‌లు, ఆటోమేటిక్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్, రెయిన్ సెన్సార్, రిమోట్ మానిటరింగ్, బ్లూటూత్‌తో పని చేసే కంట్రోల్ సిస్టమ్స్.