Share News

Gambling Chaos During Sankranti: ముంచిన బరి

ABN , Publish Date - Jan 18 , 2026 | 03:57 AM

సంక్రాంతికి రా..రమ్మంటూ పిలిచిన బరులకు అప్పులు చేసిన డబ్బుతో పందెంరాయుళ్లు గొప్పగా వెళ్లారు. మూడు రోజుల్లో డబ్బంతా పోగొట్టుకుని నెత్తిన చేతులతో .....

Gambling Chaos During Sankranti:  ముంచిన బరి

  • జూదంతో జనం జేబులకు గండి.. అప్పులు చేసి మరీ కోడి పందేలు

  • చివరికి నెత్తిన చేతులతో లబోదిబో

  • చిన్న బరుల నిర్వాహకులకు పెద్ద నష్టం

  • ముడుపుల డబ్బూ తిరిగి రాలేదు

  • పెద్ద బరులకు కోట్లలో లాభాలు

  • (భీమవరం-ఆంధ్రజ్యోతి)

సంక్రాంతికి రా..రమ్మంటూ పిలిచిన బరులకు అప్పులు చేసిన డబ్బుతో పందెంరాయుళ్లు గొప్పగా వెళ్లారు. మూడు రోజుల్లో డబ్బంతా పోగొట్టుకుని నెత్తిన చేతులతో ఇప్పుడు లబోదిబో మంటున్నారు. ఇలాంటి వారు కోస్తా జిల్లాల్లో ఊరూరా కనబడుతున్నారు. వేలల్లో పోగొట్టుకున్న వాళ్లు కొందరైతే.. లక్షల్లో జేబులకు చిల్లులు పెట్టుకున్న వారు మరికొందరు. పందేలు కాసి డబ్బు పోగొట్టుకున్న వాళ్లు కొందరైతే.. బరులు ఏర్పాటు చేసి నష్టపోయినవారు మరికొందరు. ఈసారి పెద్దబరులకు లాభాలొచ్చినా.. చిన్న బరులు ఏర్పాటు చేసిన వారు మాత్రం అధికారులకు ఇచ్చిన ముడుపుల సొమ్ము కూడా రాబట్టుకోలేకపోయారు. పెద్ద బరుల నిర్వాహకులు ఈసారి హంగామా చేయకుండా, ఖర్చు తగ్గించుకొని రూ. కోట్లలో లాభాలు పొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 100 వరకు బరులు లాభాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 30 శాతం బరులకు మాత్రం పూర్తిగా నష్టం వచ్చింది. తొలిరోజే దుకాణం సర్దేసిన బరులు కూడా ఉన్నాయి. చిన్న బరులవైపు జనం మొగ్గు చూపలేదు. బడాయికి కోడి పందేల బరి వేస్తే ఉన్నదంతా ఊడ్చికెళ్లినట్లుందని సన్నిహితులు దగ్గర కొందరు వాపోతున్నారు. ప్రతి గ్రామంలో బరులు ఏర్పాటు చేయడంతో జనం చిన్న వాటిపై ఆసక్తి చూపలేదు. అయితే తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల వచ్చిన వారు పెద్ద బరులకే క్యూ కట్టారు. మహిళల సంఖ్య ఈసారి అమాంతం పెరిగింది. భీమవరం ప్రాంతంలో మహిళలను సెక్యూరిటీగా పెట్టడంతో అలాంటి బరులకు వారు వెళ్లి పందేల కాశారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి సరైన వసతులు అందుబాటులో లేకపోవడంతో రాత్రిపూట కార్లలోనే, తామొచ్చిన ట్రావెల్స్‌ బస్సుల్లోనో నిద్రించారు. ఇక తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కుక్కుట శాస్త్రం ఆధారంగా పందేలు వేసి లాభాలు పట్టారు. చాలా బరుల్లో రూ. 2 లక్షలకు పైగా కోడి పందేల్లో గెలిచారు. వారితో పందేలకు దిగిన స్థానికులు సొమ్ములు కోల్పోయారు. పందేలు గెలిచిన వారు ఆనందంతో మందు కొట్టి చిందులేశారు. ఓడిపోయిన వారు బాధతో మరింత మద్యం తాగేశారు. సంక్రాంతి జూద క్రీడలు కొందరిలో జోష్‌ నింపాయి. ఎక్కువ మందికి అప్పులు మిగిలాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి పందేలు జరిగిన తీరు చూస్తే..


  • తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామానికి చెందిన ఓ యువకుడు సంక్రాంతి పండుగకు రూ. 20 వేలతో కోడి పందేలకు వెళ్లి.. తొలిరోజే రూ.10 వేలు పోగొట్టుకున్నాడు. గుండాటలో మొదట రూ. 5 వేలు రావడంతో ఆరోజంతా అదే బాగుందని ఆడాడు. చివరకు మొత్తం సొమ్ము పోగొట్టుకున్నాడు. తర్వాత ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి కనుమ రోజున రూ. 20 వేలు తీసుకుని వెళ్లి మళ్లీ ఆడాడు. అది కూడా పోగొట్టుకున్నాడు. సంక్రాంతి పేరు చెప్పి మొత్తం రూ. 40 వేలు జూదానికి సమర్పించాడు.

  • పెంటపాడు మండలంలోని ఓ గ్రామంలో నలుగురు వ్యక్తులు రూ. 5 లక్షలు అప్పు తెచ్చి బరి ఏర్పాటు చేశారు. సామగ్రికి, పోలీసులు, నేతలు, అధికారుల ముడుపులకు రూ. 3.50 లక్షలు ఖర్చు చేశారు. మూడు రోజుల నిర్వహణకు మిగిలిన 1.50 లక్షల ఖర్చయ్యింది. గుండాట, పకోడి దుకాణాల ద్వారా రూ. 1.20 లక్షలు వచ్చింది. మూడు రోజులకు పందేల ద్వారా రూ. 60 వేలు వచ్చింది. మొత్తానికి రూ. 3.20 లక్షల నష్టం మిగిలింది. వీరవాసరంలో తమ బరికి రూ. 5 లక్షలు నష్టం వచ్చిందంటూ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఆకివీడు రూరల్‌ మండలంలోని ఓ గ్రామంలోనూ బరి నిర్వాహకులది అదే పరిస్థితి.

  • భీమవరంలో ఓ ప్రముఖ వ్యాపారి రూ. 20 లక్షలతో కోడి పందేలు ఆడారు. మొత్తం సొమ్ము పోవడంతో మాయదారి పందేలు అంటూ స్నేహితుల వద్ద ఆడిపోసుకుంటున్నారు.

  • తణుకు రూరల్‌ మండలంలో ఓ గ్రామానికి చెందిన రాజకీయ నాయకుడు తన సమీప గ్రామంలో ఏర్పాటు చేసిన బరిలో కోడి పందేలు బాగానే జరిగినా గుండాట, పేకాట, కోతాటలకు జనం పెద్దగా రాకపోవడంతో వీటిని ఏక మొత్తంలో తీసుకున్న వ్యక్తి తీవ్రంగా నష్టపోయాడు.

  • తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ యువతి భీమవరంలో కోడి పందెంలో పాల్గొని రూ. 20 వేలు నెగ్గారు. కుక్కుట శాస్ర్తాన్ని నమ్ముకుని ఆ యువతి కాకి పుంజుపై పందెం కాసింది. ఇదే పందెంలో భీమవరానికి చెందిన ఓ యువకుడు తేతువపై పందెం కాసి ఓడిపోయి ఆ యువతికి డబ్బు చెల్లించాడు.

  • కొత్తగా ఏర్పాటు చేసిన బరుల కంటే పాత బరులకే ప్రజల తాకిడి ఎక్కువగా కనిపించింది. ఉండి నియోజకవర్గంలో సీసలి, పెద అమిరం, ఆకివీడు బరులకు కాసుల వర్షం కురిసింది. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకులో వేల్పూరు, తేతలి, పూలపల్లి, కలగంపూడి, యలమంచిలి బరులకు జనం క్యూ కట్టారు. ప్రతి మండలంలోనూ కనిష్ఠంగా 10 బరులకు వేశారు. అంటే జిల్లాలో 200కు మించి బరులు వెలిశాయి.

Updated Date - Jan 18 , 2026 | 03:57 AM