‘స్వచ్ఛందం’గా దందా!
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:23 AM
...వీటిని చూస్తే ఏమనిపిస్తోంది? కాలుష్య నియంత్రణ మండలి లేదా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అధికారులు పరమ స్ట్రిక్టుగా పని చేస్తూ, ఆయా కంపెనీలకు జారీ చేసిన నోటీసుల్లాగా ఉన్నాయనిపిస్తోందా?
‘పవర్’ చూపిస్తున్న గాజువాకలోని ట్రస్టు
సొంత నోటీసులతో పరిశ్రమలకు బెదిరింపులు
తక్షణ వివరణ ఇవ్వాలంటూ డిమాండ్లు
నాలుగు గంటలే గడువంటూ హెచ్చరికలు
ఆరు నెలల్లో 30కి పైగా సంస్థలకు నోటీసులు
సెటిల్‌మెంట్ చేయాలని అధికారులపై ఒత్తిళ్లు
సంస్థ నిర్వాకంతో పరిశ్రమలు బెంబేలు
ఇప్పటికే పోలీసులకు కొందరి ఫిర్యాదు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘‘మేఘాద్రిగెడ్డ డ్యామ్‌లోకి అక్రమ వ్యర్థాల విడుదల, ఎన్జీటీ నిబంధనల ఉల్లంఘనపై 24 గంటల్లో వివరణ కోరుతూ తుది నోటీసు!’’
‘‘చట్టవిరుద్ధమైన చర్యలపై తక్షణ వివరణ... అంటే నాలుగు గంటల్లోపు వివరణ కోరుతూ నోటీసు!’’
...వీటిని చూస్తే ఏమనిపిస్తోంది? కాలుష్య నియంత్రణ మండలి లేదా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అధికారులు పరమ స్ట్రిక్టుగా పని చేస్తూ, ఆయా కంపెనీలకు జారీ చేసిన నోటీసుల్లాగా ఉన్నాయనిపిస్తోందా? అయితే... మీరు ‘స్వచ్ఛందం’గా తప్పులో కాలేసినట్లే! ఇవి విశాఖకు చెందిన ఒక స్వచ్ఛంద ట్రస్టు ప్రతినిధి అక్కడి పరిశ్రమలకు స్వయంగా జారీ చేసిన నోటీసులు! పీసీబీ, ఎన్జీటీ అధికారులకు కూడా ఉందో లేదో తెలియని ‘పవర్’ను ఈ స్వచ్ఛంద సంస్థ ప్రయోగిస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకే కాదు.. భారీ కంపెనీలకు సైతం చుక్కలు చూపిస్తోంది. పరిశ్రమలు, మరీ ముఖ్యంగా కొన్ని రసాయన పరిశ్రమలు వ్యర్థాల నిర్వహణ అడ్డగోలుగా చేస్తుండటం సహజం. దీనిపై ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించడమూ అంతే సహజం! అయితే... ఎవరూ నేరుగా కంపెనీలకు ‘వివరణ’ డిమాండ్ చేస్తూ నోటీసులు ఇవ్వరు. ప్రభుత్వ యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం లేదా... పరిస్థితి మరీ శ్రుతిమించితే కంపెనీ ముందు ఆందోళనలకు దిగడం వంటివి చేస్తుంటారు.
నిజంగా న్యాయపోరాటం చేయాలనుకుంటే... నిబంధనల ప్రకారం లాయర్ నోటీసు ఇవ్వొచ్చు. నేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయవచ్చు. కానీ... గాజువాక సమీపంలో దంపతులు నడిపే ఈ స్వచ్ఛంద సంస్థ తీరే వేరు. వీరు గత ఆరు నెలల్లో పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లోని 30కి పైగా కంపెనీలకు నేరుగా తమ ట్రస్టు లెటర్ హెడ్ మీదే నోటీసులు ఇచ్చేశారు. ‘మీ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు మాదగ్గర ఉన్నాయి. 24 గంటల్లో వివరణ ఇవ్వాలి. 4 గంటల్లో సమాధానాలు చెప్పాలి’ ఇలాంటి తీవ్ర పదజాలాన్ని ప్రయోగిస్తున్నారు. ‘లేదంటే కేసు ఎక్కడికో వెళుతుంది’ అని కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులు బెంబేలెత్తుతున్నారు. చిన్న లొసుగులు ఉన్న కొన్ని కంపెనీలు వారికి ఎంతో కొంత ముట్టజెప్పడంతో పాటు నెలవారీ మామూళ్లు కూడా ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.
ఫిర్యాదులు.. కేసులు...
గాజువాక సమీపంలో ఎరువులు తయారుచేసే కర్మాగారం ఉంది. వారికి అవసరమైన నీటిని ట్యాంకర్లతో తెప్పించుకుంటున్నారు. అయితే నీటి వనరులను తస్కరిస్తున్నారంటూ ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పరిశ్రమల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు సంస్థ సభ్యుల సమక్షంలోనే తనిఖీలు చేశారు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. అయినా ఆ ఎన్‌జీఓ ప్రతినిధులు కర్మాగారం యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. కేసులు పెడతామని బెదిరించారు. అప్పటికీ వారు లొంగకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. ఈ స్వచ్ఛంద సంస్థను నడిపే కుటుంబంలో ఒక న్యాయవాది ఉన్నారని, ఆ ధీమాతోనే ఎడాపెడా నోటీసులు ఇస్తున్నారని తెలిసింది.
అధికారులపైనా అక్కసు
కాన్వెంట్ జంక్షన్‌లో కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న పరిశ్రమ ఒకటి ఉంది. అదే సంస్థ అనకాపల్లి జిల్లాలో అతిపెద్ద పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ వృథా జలాలను బయటకు వదిలేస్తోందని ఆరోపిస్తూ సదరు స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. వారిని వెంటబెట్టుకొని అధికారులు తనిఖీలకు వెళ్లారు. ఆరోపించినట్టుగా అక్కడ ఏమీ కనిపించలేదు. దాంతో ఫిర్యాదీలు మాట మార్చారు. ఎదురుగా పోర్టు స్థలంలోని మదుము నుంచి నీటిని ట్యాంకర్లతో తీసుకువెళ్లిపోతున్నారని, ఇది నీటి తస్కరణ కిందికే వస్తుందని వాదనకు దిగారు. అది పోర్టుకు సంబంధించిన అంశమని, ఈ పరిశ్రమకు సంబంధం లేదని అధికారులు తేల్చారు. దాంతో ఫిర్యాదీలు పోర్టుపైన, తమకు లొంగని పరిశ్రమపైనా కేసులు వేశారు.
ఫార్మా కంపెనీల నుంచి వసూళ్లు
ఫార్మా కంపెనీల నుంచి వ్యర్థాలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకొని బెదిరించడానికి ఈ సంస్థ ప్రతినిధులు ఒక ముఠాను ఏర్పాటు చేసుకొన్నారు. కంపెనీల నుంచి బయటకు వచ్చే ట్యాంకర్లను వెంబడించి వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. కొన్ని వాహనాలు వ్యర్థాలు తరలించిన తరువాత క్లీనింగ్ కోసం వాటర్ స్టేషన్లకు వెళితే.. ఏ విష రసాయనాలు తరలించి ఇక్కడికి వచ్చారంటూ డ్రైవర్లను బెదిరిస్తున్నారు. తమ దందా కోసం సమాచార హక్కు చట్టాన్ని కూడా వాడుకుంటున్నారు. బెదిరింపులకు లొంగని సంస్థలు, అధికారుల గురించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేస్తున్నారు. సహకరించని అధికారులపై తప్పుడు పనులు చేస్తున్నారని, వారిని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని పైస్థాయిలో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సంస్థ బెదిరింపులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికి వారు బెదిరించడం మొదలుపెడితే... పరిశ్రమలను మూసి పారిపోక తప్పదని యజమానులు వాపోతున్నారు.