Share News

వేగం వద్దంటున్నా వినలేదు!

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:33 AM

‘సీట్లలో కూర్చోలేకపోతున్నాం.. మీ స్పీడుకు ఎగిరెగిరి పడుతున్నాం.. అంత స్పీడు వద్దు’ అని ఎంత బతిమాలుకున్నా.. ఆ బస్సు డ్రైవర్‌ వినిపించుకోలేదు.

వేగం వద్దంటున్నా వినలేదు!

  • నిర్లక్ష్యం.. ఆపై అతివేగం

  • ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

  • ముగ్గురు దుర్మరణం.. 9 మందికి గాయాలు

  • గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం

గాజువాక (విశాఖపట్నం), మే 31(ఆంధ్రజ్యోతి): ‘సీట్లలో కూర్చోలేకపోతున్నాం.. మీ స్పీడుకు ఎగిరెగిరి పడుతున్నాం.. అంత స్పీడు వద్దు’ అని ఎంత బతిమాలుకున్నా.. ఆ బస్సు డ్రైవర్‌ వినిపించుకోలేదు. దానికి తోడు తెల్లవారు జాము కావడంతో ఆ డ్రైవర్‌ నిద్రమత్తు ప్రయాణికులను నిండా ముంచింది. విశాఖ నగర పరిధిలోని గాజువాకలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో సహా ముగ్గురు మృతిచెందారు. మరో తొమ్మిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు గాజువాక శ్రీనగర్‌ జంక్షన్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ పాయింట్‌ సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుకు కుడివైపున టైరు పంక్చరైన లారీ నిలిపివుంది. దీనిని గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మితిమీరిన వేగంతో నడుపుతూ లారీని ఎడమవైపు బలంగా ఢీకొని దూసుకుపోయాడు. దీంతో బస్సుకు కుడివైపున డ్రైవర్‌ సీటువద్ద నుంచి వెనుక 8 సీట్ల వరకు బాడీ మొత్తం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన బస్సు కో-డ్రైవర్‌ రాయిపల్లి రాంబాబు (50), రాజమహేంద్రవరం సీతంపేటకు చెందిన ఆర్‌.రాధామాధవి (35), విజయనగరానికి చెందిన లెంక ఈశ్వరమ్మ (55) సంఘటన స్థలంలోనే మృతిచెందారు.


బస్సు డ్రైవర్‌ ఎస్‌.జమ్మయ్య (పార్వతీపురం )తో పాటు ప్రయాణికులు ఆకుల శివ నాగేశ్వరరావు, మావూరి శ్రీనివాస్‌ (రాజమహేంద్రవరం), నివ్య జీవిత, లంకా ఈశ్వరమ్మ (విజయనగరం), కనకం రాజు, కనకం లలిత (పార్వతీపురం), కె.రామకృష్ణ (జామి, విజయనగరం జిల్లా), ప్రశాంతి, చిన్నారులు ఆర్‌.తన్విహ (రాజమహేంద్రవరం), ఎం.నివేదిత (7)లకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, బస్సు సీట్లలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను, మృతదేహాలను బయటకుతీసి, విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. లారీని రోడ్డుకు కుడివైపున నిలిపి ఉంచడంతో దగ్గరకు వచ్చేవరకు బస్సు డ్రైవర్‌కు కనిపించకపోవడం, నిద్రమత్తు ముంచుకురావడం, వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ప్రమా దం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ షేక్‌ హుస్సేన్‌ తెలిపారు.


మితిమీరిన వేగమే కారణమా?

బస్సు డ్రైవర్‌ ఎస్‌.జమ్మయ్య మితిమీరిన వేగంతో బస్సును నడపడంతో సీట్లలో కూర్చోలేని పరిస్థితి ఎదురైందని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. లగేజీ బాక్సులో వస్తువులు కింద పడిపోవడంతో భయాందోళన చెంది, వేగంగా నడపవద్దని డ్రైవర్‌ను హెచ్చరించామని ప్రయాణికులు చెప్పారు. అయినప్పటికీ డ్రైవర్‌ పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.

5 లక్షలు ఎక్స్‌గ్రేషియా: రవాణా మంత్రి

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వ తరఫున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి తెలిపారు. విశాఖ వచ్చిన ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బస్సును పరిశీలించారు.

Updated Date - Jun 01 , 2026 | 04:37 AM