బెజవాడ కోర్టు షరతులతో దర్యాప్తునకు ఆటంకం!
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:21 AM
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడు సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు విధించిన షరతులు సిట్ దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్...
హైకోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదన.. సీఐ నాగరాజును విచారించేటప్పుడు వీడియో రికార్డింగ్‌కు అభ్యంతరం లేదు
ఆడియో రికార్డింగ్‌తో విచారణపై ప్రభావం: పీపీ
నేడు నిర్ణయం వెల్లడిస్తామన్న న్యాయమూర్తి
అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడు సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు విధించిన షరతులు సిట్ దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ హైకోర్టుకు నివేదించారు. ఆ షరతులను పరిశీలిస్తే దర్యాప్తు ప్రక్రియను విజయవాడ కోర్టు మేజిస్ట్రేట్ పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని, ఈ సమయంలో దర్యాప్తు అధికారికి పూర్తి అధికారాలు ఉంటాయని.. నిందితుడిని ఎక్కడ విచారించాలనే అధికారం పూర్తిగా దర్యాప్తు అధికారిదేనని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని సోమవారంనాటి విచారణలో తెలియజేశారు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. నిందితుడి విచారణ సమయంలో వీడియో రికార్డింగ్ చేయడానికి అభ్యంతరం లేదని.. అయితే ఆడియో రికార్డింగ్‌తో దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపారు. నేర ఘటన కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిందని.. నిందితుడు సీసీటీవీ ఫుటేజ్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఆధారాలు, ఇతర రికార్డులను మాయం చేశారని పేర్కొన్నారు. కేసులో సాక్షులుగా ఉన్నవారిని నిందితుడితో కలిపి విచారించాల్సి ఉందని.. నాగరాజును విచారించే సమయంలో ఏవైనా ఆధారాలు లభిస్తే ఆయన్ను ఆ ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుందని వివరించారు. జైలు నుంచి బయటకు తీసుకెళ్లనివ్వకుంటే నిందితుడి వాంగ్మూలం ఆధారంగా సాక్ష్యాల సేకరణ సాధ్యం కాదన్నారు. నాగరాజును కృష్ణలంక స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తే.. ఆయన హక్కులకు ఎలాంటి భంగం కలుగదని తెలిపారు. పోలీసు కస్టడీ సమయంలో ప్రాణహాని ఉందని పిటిషనర్ భావిస్తే.. విచారణ ముగిశాక ప్రతి రోజూ గుంటూరు జైలుకు తరలించడానికి అభ్యంతరం లేదన్నారు. సీఐ నాగరాజు తరఫు న్యాయవాది చల్లా అజయ్‌కుమార్ స్పందిస్తూ... బీఎన్‌ఎ్‌సఎస్ చట్ట నిబంధనల ప్రకారం కస్టడీ సమయంలో నిందితుడిని ప్రశ్నించే ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారిపై ఉందన్నారు. నాగరాజుకు ప్రాణహాని పొంచి ఉందని.. ఈ నేపథ్యంలో అన్ని సౌకర్యాలూ ఉన్న రాజమహేంద్రవరం కారాగారంలోనే నిందితుడిని విచారించాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో.. మంగళవారం నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ప్రకటించారు.