మరో ఆరు నెలలు సీఎస్‌గా జి.సాయిప్రసాద్
ABN , Publish Date - May 16 , 2026 | 04:58 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పాటు పొడిగించింది.
నవంబరు 30 వరకూ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ అండర్ సెక్రటరీ రాజేశ్ కుమార్ యాదవ్ గురువారమే ఏపీ సాధారణ పరిపాలన శాఖకు సమాచారం అందించారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జి.సాయిప్రసాద్ ఈ నెల 31న రిటైర్ కావాల్సి ఉంది. అయితే ఆయన సేవలను కొనసాగించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ ఈ నెల 6న కేంద్రానికి లేఖ రాసింది. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ నవంబరు 30 వరకూ కొనసాగనున్నారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.