Share News

ఊరి బడే ముద్దు!

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:45 AM

విజయనగరం జిల్లా రాజాం మండలం గార్రాజు చీపురుపల్లి వాసులు ప్రైవేటు బడుల్లో చదువుతున్న వారి పిల్లల్ని తీసుకొచ్చి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్చారు.

ఊరి బడే ముద్దు!

  • జి.చీపురుపల్లి గ్రామస్థుల ఆదర్శం

  • ప్రైవేటు నుంచి తొలుత ఇద్దరు చేరిక..అదే స్ఫూర్తితో మరో 40 మంది

రాజాం రూరల్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా రాజాం మండలం గార్రాజు చీపురుపల్లి వాసులు ప్రైవేటు బడుల్లో చదువుతున్న వారి పిల్లల్ని తీసుకొచ్చి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్చారు. తొలత మాజీ సర్పంచ్‌ ఒకరు రాజాంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు పిల్లల్ని గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించగా, మిగిలిన తల్లిదండ్రుల్లో ఆలోచన రేకెత్తింది. అదే స్ఫూర్తితో.. రాజాంలోని పలు కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలల్లో.. ఒకటి నుంచి 8వ రకు చదువుతున్న 40 మంది విద్యార్థులను తీసుకొచ్చి గ్రామంలోని ప్రభు త్వ బడి లో చేర్చారు. వారి చేరికతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 110కి చేరింది. వారంతా గురువారం నుంచి పాఠశాలకు రావడంతో సందడి నెలకొంది.

ఉపాధ్యాయుల కృషి

దీనివెనుక ఆ పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. గ్రామం నుంచి రోజూ తల్లిదండ్రులు అనేక వ్యయప్రయాసలకోర్చి పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు తీసుకెళ్తున్న వైనాన్ని చూసి.. గ్రామ తాజా మాజీ సర్పంచి పొన్నాడ భీమేశ్వర్రావుతో చర్చించారు. తాము నాణ్యమైన విద్య అందిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో ఆయన తొలుత రాజాంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి ప్రభుత్వ బడిలో చేర్పించారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మిగతా తల్లిదండ్రులు.. మొత్తం 38 మంది పిల్లలను ప్రభుత్వ బడిబాట పట్టించారు.

Updated Date - Jun 19 , 2026 | 04:45 AM