నిధులొస్తాయ్..
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:45 PM
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.
ప్రగతి బాట పట్టనున్న పల్లెలు
పంచాయతీలకు కేంద్రం చేయూత
నూతన నిబంధనలతో 16వ ఆర్థిక సంఘం నిధులు
బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశాలు
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు. పల్లెల్లో అభివృద్ధి జరగాలన్నా.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా గ్రామ పంచాయతీలకు నిధులు పుష్కలంగా రావాలి. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజాపరిషతలకు 15వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే వచ్చేవి. ఇక నుంచి పంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు సైతం రానున్నాయి. బ్యాంకుల్లో నూతనంగా ఖాతాలు తెరవాలని పంచాయతీరాజ్ కమిషనరేట్ ఆదేశించింది.
శిరివెళ్ల, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులతో పాటు సొంత ఆదాయ వనరుల ద్వారా నిధులు సమకూర్చుకుని ప్రజల సంక్షేమం కోసం వినియోగించడమే పంచాయతీల విధి. నేటి వరకు అరకొర నిధులతో సతమతమవుతున్న గ్రామ పంచాయతీలకు కేంద్రం నూతన జవసత్వాలను అందించనుంది. స్థానిక సంస్థల బలోపేతమే ధ్యేయంగా పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 16వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం అందించే ఆర్థిక చేయూతతో పల్లె ప్రగతి బాట పట్టనున్నాయి.
ఐదేళ్ల పాటు నేరుగా..
కేంద్రం విడుదల చేయనున్న 16వ ఆర్థిక సంఘం నిధులు ఈఏడాది నుంచి ఐదేళ్లపాటు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలకు జమకానున్నాయి. ఇందుకోసం యూనియన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో త్వరగా నూతన ఖాతాలు తెరవాలని పంచాయతీరాజ్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు నంద్యాల జిల్లాలోని 489 గ్రామ పంచాయతీల కు, కర్నూలు జిల్లాలోని 484 పంచాయతీలకు స్పెషలాఫీసర్, గ్రామ పంచాయతీ పేరుతో కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవనున్నారు. ఈప్రక్రియను పూర్తిచేసేందుకు డీపీవో, డీడీవోలకు బాధ్యతలు అప్పగించారు.
అక్రమాలకు అడ్డుకట్ట
కేంద్రం ఇచ్చే ఈ నిధులు దారిమళ్లకుండా, పంచాయతీల్లో జరిగే అక్రమాలకు అడ్డుకుట్టవేసి పల్లెల అభివృద్ధికి నిధులు ఖర్చు చేసేలా చర్యలు చేపట్టనుంది. గ్రామ పంచాయతీల నుంచి చెక్కుల ద్వారా చెల్లింపులకు చెక్‌పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గ్రామ స్వరాజ్, సీఎ్‌ఫఎంస్ ద్వారా ఆర్థిక లావాదేవీలు చేపట్టాలని దిశా నిర్ధేశం చేసింది.
నిధుల వినియోగానికి మార్గదర్శకాలు..
గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసే 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి కొన్ని మార్గదర్శకాలు చేసింది. కేటాయించిన నిధుల్లో 40శాతం రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, కల్వర్టులు, అంతర్గత రహదారుల నిర్మాణానికి వినియోగించాలి. మరో 40 శాతం నిధులు పారిశుధ్యం మెరుగుపరచడం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ఏర్పాటు, వాటి నిర్వహణ, ప్లాస్టిక్ నిర్మూలన తదితర వాటికి వినియోగించాలని పేర్కొంది.
ప్రోత్సాహకాల రూపంలో..
వంద శాతం నిధుల్లో 80 శాతం వివిధ అభివృద్ధి పనులకు వినియోగిస్తారు. మిగిలిన 20 శాతం నిధులను కేంద్రం తన వద్దే ఉంచుకుని గ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకుని ప్రోత్సాహకాల రూపంలో తిరిగి పంచాయతీలకు ఇవ్వనుంది. వే లం పాటలు, ఇంటి, కుళాయి, వ్యాపార పన్నుల వసూళ్లలో వంద శాతం పురోగతి సాధించడంతో పాటు సొంత ఆదాయాలను పెంచుకుని ముందుకుసాగుతున్న గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకరంగా 10 శాతం నిధులను ఇవ్వనుంది. మిగిలిన 10శాతం నిధులను రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులకు జత చేసి ప్రాధాన్యత క్రమంలో పంచాయతీలకు కేటాయించనుంది.
పంచాయతీల అభివృద్ధి కృషి
జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. పంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైతే గ్రామాల్లోని ప్రజలకు మరిన్ని మెరుగైన మౌలిక వసతులు సమకూరుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను పంచాయతీల్లో సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తాం.
ఫ లలితాబాయి, ఇనచార్జి డీపీవో, నంద్యాల