హంద్రీనీవాకు నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:13 PM
సాగు, తాగునీటిని అందించే హంద్రీనీవా ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పత్తికొండ టౌన్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): సాగు, తాగునీటిని అందించే హంద్రీనీవా ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ిసీఆర్ భవన్ నుంచి సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గిడ్డయ్య మాట్లాడుతూ పత్తికొండ మీదుగా హంద్రీనీవా ప్రధాన కాలువ వెళ్తున్నా ఈ ప్రాంత రైతాంగానికి మాత్రం ఉపయోగపడడం లేదన్నారు. ఇప్పటికైనా హంద్రీనీవా ప్రధాన కాలువ కింద ఉన్న పందికోన, క్రిష్ణగిరి రిజర్వాయర్‌లు కుడి, ఎడమ కాలువల స్థిరీకరణ పనులు, పంట కాలువల నిర్మాణం పనులు పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ పనులు పూర్తి చేసేందుకు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ సమావేశాల్లో హంద్రీనీవా ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని చెరువులను హంద్రీనీవా జలాలతో నింపాలని, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గళాన్ని వినిపించాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు కారుమంచి, రామాంజనేయులు, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి సురేంద్రకుమార్, ప్రజా సంఘాల నాయకులు కారన్న, కృష్ణ, వీరన్న, గిడ్డయ్యగౌడ్, కాశీం పాల్గొన్నారు.