Fruit Covering Method: పండ్లకు కవర్ల రక్ష
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:36 AM
ఉద్యానవన సాగులో అధిక దిగుబడులే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విధానాలు అవలంబిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పండ్ల తోటలు అధికంగా సాగులో ఉన్న రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర...
నాణ్యత, అధిక ధర సాధనే లక్ష్యం
నిరుడు మామిడిలో మంచి ఫలితాలు
అరటి, దానిమ్మకూ తొడుగులు
ఈ ఏడాది అన్ని పండ్లకూ కవరింగ్
50 వేల హెక్టార్లలో అమలుకు నిర్ణయం
ఉద్యాన రైతులకు 50శాతం రాయితీ
ఏ వస్తువుకైనా కవర్(తొడుగు) ఉంటే కొంత రక్షణ ఉంటుంది. మార్కెట్లో మనం కొనుగోలు చేస్తే ఎన్నోరకాల వస్తువులు ఇదే కోవలో ఉంటాయి. ఇప్పుడు ఉద్యానవన సాగులోనూ కవర్ల విధానం వస్తోంది. కవర్లను చుట్టడం ద్వారా మామిడి, అరటి, దానిమ్మ, జామ వంటి పండ్లలో నాణ్యత పెంచడా నికి ఉద్యానశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ విధానంతో పండ్ల ఉత్పత్తి పెరగడంతో పాటు, ఎగుమతుల ద్వారా రైతులకు అధిక ధర, ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో అందుకుతగ్గ ప్రణాళిక అమలు పరుస్తోంది. నిరుడు మామిడిలో అమలు చేసి, మంచి ఫలితాలు రాబట్టింది. ఈ ఏడాది అరటి, దానిమ్మ, జామ పండ్లకూ కవర్ల తొడుగు లతో ఎగుమతికి అనువైన ఉత్పత్తి సాధించడానికి ప్రణాళిక రూపొందించింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉద్యానవన సాగులో అధిక దిగుబడులే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విధానాలు అవలంబిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పండ్ల తోటలు అధికంగా సాగులో ఉన్న రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో కొత్తగా కవర్ల విధానాన్ని అమలు చేయనుంది. నోరూరించే మధుర ఫలంగా పేరొంది, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న మామిడి పండ్లలో మంగు, డాగు లేకుండా.. కంటికి ఇంపుగా కనిపించి, నోటికి రుచిగా ఉండేలా ఉత్పత్తి చేయడానికి గత ఏడాది కవర్లు చాలా ఉపయోగపడ్డాయి. మామిడి పిందె దశలోనే కవర్లు తొడగడంతో కాయ కోతకొచ్చే సరికి పసుపు వర్ణంలో నాణ్యంగా తయారవడంతో రైతులు మంచి ధర పొందారు. ఒక్క కవర్ రూ.రెండు మాత్రమే. కాయకో కవర్ తొడుగుతారు. దీనివల్ల శీతాకాలంలో మంచు పడకుండా ఉంటుంది. మంచు వల్ల కాయ పాడవకుండా ఉంటుంది. కాయలకు మంగు వంటి తెగుళ్లు ఆశించకుండా ఉంటాయి. కిలోకు సగటున మూడు కాయల చొప్పున టన్నుకు మూడు వేల కాయలొస్తాయి. అంటే టన్నుకు రూ.6వేలు కవర్ల ఖర్చవుతుంది. కవర్ల తొడుపు లేని బంగినపల్లి రకం మామిడి టన్ను రూ.25వేలు ఉంటే.. కవర్‌తో ఉండే పండ్లు రూ.40నుంచి 60వేలుపలికాయి. తోతాపురి మామిడికి కవర్లు లేకపోతే టన్ను రూ.5వేలు పలకని పరిస్థితి ఉంటే.. కవరింగ్ వల్ల రూ.15నుంచి 20వేలు పలికింది. బంగినపల్లి హెక్టారుకు 12.5టన్నుల దిగుబడి వస్తే.. టన్నుకు రూ.16వేలు చొప్పున రూ.2లక్షల అదనపు ఆదాయం రైతులు పొందినట్లు ఉద్యాన అధికారులు చెప్తున్నారు.
అరటి, దానిమ్మ సాగులో..
అరటిలో ఫ్రూట్ కేర్ విధానంతో ఒక్కో గెలకు రూ.20 ఖర్చుతో కవర్ తొడిగితే.. హెక్టారుకు 3వేల అరటి మొక్కలకు రూ.60వేలు ఖర్చవుతుంది. హెక్టారుకు 65టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు రూ.923 ఖర్చవుతుంది. అయితే ఎగుమతి రకంపై టన్నుకు రూ.2వేలు చొప్పున హెక్టారుకు రూ.లక్షా30వేల అదనపు ఆదాయం లభిస్తుంది. హెక్టారుకు కవర్ల ఖర్చు రూ.60వేలు పోతే.. రూ.70వేలు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేశారు. 2024-25లో అరటిలో 2వేల హెక్టార్లకు ఈ కవర్ల తొడుపులు చేయగా, ఈ ఏడాది రూ.5వేల హెక్టార్లకు ఇవ్వాలని నిర్ణయించారు. దానిమ్మ తోటలు గాలులకు పడిపోకుండా ఊత కర్రలు పెట్టడం, కాయలకు గ్రో కవర్లు తొడగటానికి హెక్టారుకు రూ.62,500 ఖర్చయితే.. పురుగు మందుల వినియోగం తగ్గి రూ.12,500 మిగలడంతో పాటు, హెక్టారుకు 20టన్నుల దిగుబడితో టన్నుకు రూ.10వేలు, హెక్టారుకు రూ.2లక్షల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ విధానంలో నిరుడు 500 హెక్టార్లలో అమలు చేయగా, ఈ ఏడాది 5వేల హెక్టార్లలో అమలు చేయాలని నిర్ణయించారు. 2026 నుంచి జామ తోటల రైతులకు కూడా కవర్లు రాయితీపై ఇవ్వాలని నిర్ణయించారు. దీని కవర్ 50పైసలు మాత్రమే ఉంటుంది. అలాగే కోకో పంట కోత అనంతరం గింజల నాణ్యత, రుచి కోసం చెక్క పెట్టెల్లో నిల్వ చేసే విధానాన్ని రూపొందించారు. ఈ చెక్క పెట్టెలను 15-20ఏళ్లు వినియోగించవచ్చు. ఈ పెట్టెలను 35ు సబ్సిడీపై అందించనున్నారు. కోకో పంట కిలో రూ.50అదనంగా పలికి, టన్నుకు రూ.50వేలు అధికంగా లభిస్తుంది.
ట్రెల్లిసింగ్ పద్ధతిలో టమాటా సాగు
శాశ్వత పందిరి కూరగాయ పంటలు సాగు చేసే విధానాలను కూడా ఉద్యానశాఖ చేపట్టింది. కూరగాయల తోటలను సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తే.. 45 రోజులకు 5 కోతలు మాత్రమే వస్తుంది. ఎకరానికి రూ.లక్ష ఖర్చు చేసినా.. 24టన్నులే దిగుబడి వస్తుంది. ఈ తరహా టమాటాకు మార్కెట్‌లో టన్ను రూ.10వేలు మించి పలకని పరిస్థితి. నికరంగా రైతుకు ఎకరానికి రూ.లక్షా 40వేలు వస్తేనే లాభం. అదే ట్రెల్లిసింగ్ పద్ధతిలో మూడు నెలల్లో 15కోతలు వస్తాయి. ఎకరానికి రూ.లక్షా 60వేలు ఖర్చయినా.. 30 టన్నుల దిగుబడి వస్తుంది. టన్ను రూ.12వేలు పలికినా.. రూ.3.60 లక్షలు వస్తాయి. ఖర్చులు పోను రూ.2లక్షలు మిగులుతాయని అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా అన్ని రకాల కూరగాయ పంటలను సాగు చేసి, అదనపు ఆదాయం పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ అధికారులు నిర్ణయించారు.
అదనపు ఆదాయానికి ఉత్తమ విధానం
కవర్లు వినియోగించడం ద్వారా కోస్తాలో తోతాపురి మామిడి రైతులు హెక్టారుకు 15 టన్నుల దిగుబడికి గాను టన్నుకు రూ.6వేల చొప్పున రూ.90వేల అదనపు ఆదాయం పొందారు. ఇలా హెక్టారుకు రూ.1,12,500 ఖర్చు పెడితే.. బంగినపల్లికి రూ.2లక్షలు, తోతాపురికి రూ.90వేల అదనపు ఆదాయం లభించింది. 2024-25లో 10వేల హెక్టార్ల మామిడి తోటల్లో ఈ కవర్ల తొడుపులు చేపట్టాం. ఈ ఏడాది 50వేల హెక్టార్లలో అమలు చేయాలని నిర్ణయించాం.
-శ్రీనివాసులు, ఉద్యానశాఖ డైరెక్టర్