Share News

స్వాతంత్య్ర సమరయోధుడు టీసీ రాజన్‌ కన్నుమూత

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:21 AM

స్వాతంత్య్ర సమరయోధుడు, చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్‌ (108) కన్నుమూశారు.

స్వాతంత్య్ర సమరయోధుడు టీసీ రాజన్‌ కన్నుమూత

  • నేడు పలమనేరులో అంత్యక్రియలు

పలమనేరు, మార్చి20 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు, చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్‌ (108) కన్నుమూశారు. బెంగళూరులోని కుమార్తె ఇంట్లో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో అసువులు బాశారు. పెద్దపంజాణి మండలం రాయలపేటలో జన్మించిన ఆయన బీఏ చదువుతుండగా గాంధీజీ ప్రసంగాలకు ప్రభావితులై స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. అప్పట్లో టెలిఫోన్‌ వైర్లను కత్తిరించి బ్రిటీషు వారి సమాచార వ్యవస్థకు అంతరాయం కలిగిస్తూ ఇబ్బందుల పాలుచేశారు. ఈ ఘటనలో ఆయన్ను అప్పట్లో అరెస్టుచేసి జైలుకు పంపించారు. స్వాతంత్ర్యానంతరం కాంగ్రె్‌సను వీడి స్వతంత్ర పార్టీలో చేరారు. చిత్తూరు ఎంపీగా గెలిచిన అనంతశయనం బిహారు గవర్నరుగా నియమితులు కావడంతో ఆ స్థానంలో ఎన్జీ రంగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర పార్టీకి ఇన్‌చార్జిగా టి.సి.రాజన్‌ ఉన్నారు. రంగా కోసం విస్తృతంగా ప్రచారం చేసి 19,500 ఓట్ల మెజారిటీ తీసుకురావడం ద్వారా ఎన్జీ రంగా చిత్తూరు ఎంపీగా గెలవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు ఎమ్మెల్యేగా రాజన్‌ గెలుపొందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జడ్జిగా రిటైరైన ఆయన సతీమణి.. దశాబ్దం కిందట మృతిచెందారు. రాజన్‌ భౌతిక కాయాన్ని బెంగళూరు నుంచి పలమనేరుకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, ఆర్డీవో భవానీ తదితర అధికారులు, నేతలు నివాళులర్పించారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. నిరాడంబరంగా, ఉన్నత విలువలతో టీసీ రాజన్‌ జీవించారంటూ పలువురు సంతాపం తెలిపారు.

Updated Date - Mar 21 , 2026 | 05:23 AM