క్యాన్సర్ రోగులకు ఉచిత జన్యు పరీక్షలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:59 AM
రాష్ట్రంలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో రూ.2.50 కోట్ల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేసిన సమగ్ర క్యాన్సర్ జన్యు పరీక్షల కేంద్రాన్ని (ఇంటిగ్రేటెడ్ జీనోమిక్ సొల్యూషన్ సెంటర్) ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు.
అందుబాటులోకి ప్రత్యేక జన్యు పరీక్షల కేంద్రం
గుంటూరులో ప్రారంభించిన మంత్రి సత్యకుమార్
గుంటూరు మెడికల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో రూ.2.50 కోట్ల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేసిన సమగ్ర క్యాన్సర్ జన్యు పరీక్షల కేంద్రాన్ని (ఇంటిగ్రేటెడ్ జీనోమిక్ సొల్యూషన్ సెంటర్) ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య రంగంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన నెక్ట్స్‌జనరేషన్ జెనెటిక్ సీక్వెన్సింగ్ టెస్టింగ్ మెషిన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. దేశీయ క్యాన్సర్ వైద్య రంగంలో విప్లవాత్మకమైన నూతన చికిత్స నమూనాను రాష్ట్రంలో పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఆస్ట్రాజెనకా, స్టాండ్ లైఫ్ సైన్స్ సంస్థలతో కలసి రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జీజీహెచ్‌లో ఈ జన్యు పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రాజెనెకా ప్రతినిధి కిరణ్ పీ కేశవన్ ఈ ల్యాబ్ ద్వారా ప్రస్తుతం రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు నిర్వహిస్తామని, భవిష్యత్తులో మరిన్ని క్యాన్సర్ వ్యాధులకు విస్తరిస్తామని తెలిపారు.