దర్శనం టికెట్ల గోల్‌మాల్!
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:31 AM
ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనం టిక్కెట్ల గోల్‌మాల్ జరిగింది. స్కానింగ్ పాయింట్ వద్ద జరిగిన ఈ వ్యవహారం ఆదివారం బయటపడింది.
ద్వారకాతిరుమలలో వెలుగులోకి
భక్తులకు నకిలీ రూ.200 టికెట్లు విక్రయం
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు.. కేసు నమోదు
ద్వారకాతిరుమల, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనం టిక్కెట్ల గోల్‌మాల్ జరిగింది. స్కానింగ్ పాయింట్ వద్ద జరిగిన ఈ వ్యవహారం ఆదివారం బయటపడింది. సెలవుదినం కావడంతో ఆలయం భక్తులతో రద్దీగా ఉంది. కొందరు భక్తులు స్వామి దర్శనం నిమిత్తం తెచ్చిన రూ.200 టిక్కెట్లను పాయింట్ వద్ద సిబ్బంది స్కాన్ చేస్తుంటే నాట్ ఫౌండ్ అని వస్తోంది. ఈ విషయాన్ని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఆలయ ఈఈ, ఏఈవో, సూపరింటెండెంట్‌లకు చెప్పారు. వారు టిక్కెట్లను కంప్యూటర్‌లో పరిశీలించి...అవి దేవస్థానం టిక్కెట్ల జారీకి వినియోగించే సాఫ్ట్‌వేర్ ద్వారా వచ్చినవి కావని తేల్చారు. టిక్కెట్లపై పీవోఎస్- 3 అని రావాల్సి ఉండగా పీవోఎస్-1 అని రావడంతో అనుమానం బలపడింది. దేవస్థానం సాఫ్ట్‌వేర్‌కు సమాంతరంగా మరో సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఆ టికెట్లు జారీ చేసినట్టు చెబుతున్నారు. రూ.200 దర్శనం టిక్కెట్లు ఇటువంటివి దాదాపు 61 వరకు లభించాయి. టిక్కెట్లు ఇచ్చే కౌంటర్‌లో విధులు నిర్వహించే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఐఎ్‌సజే రాజును దేవస్థానం ఈవో యర్రంశెట్టి భద్రాజీ విధుల నుంచి తొలగించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.