సముద్రంలో చిక్కుకున్న సాయిల్ టెస్ట్ నిపుణులు
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:44 AM
సముద్రంలో చిక్కుకున్న సాయిల్ టెస్ట్ నిపుణులు నలుగురిని మెరైన్ పోలీసులు మత్స్యకారుల సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మత్స్యకారుల సాయంతో కాపాడిన మెరైన్ పోలీసులు
అచ్యుతాపురం (అనకాపల్లి జిల్లా), ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): సముద్రంలో చిక్కుకున్న సాయిల్ టెస్ట్ నిపుణులు నలుగురిని మెరైన్ పోలీసులు మత్స్యకారుల సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బాబా అటామిక్ రిసెర్ ్చ సెంటర్ (బార్క్) కోసం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం-తంతడి మధ్య సుమారు 2,200 ఎకరాలు కేటాయించారు. బార్క్ కోసం అక్కడ జెట్టీ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం సముద్రంలో శాండ్ టెస్టింగ్ (ఇసుక పరీక్షలు) చేసే పనిని ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీకి చెందిన నలుగురు నిపుణులు పరీక్షల కోసం వినియోగించే పరికరాలతో బుధవారం సాయంత్రం విశాఖపట్నం నుంచి బార్జ్ (బల్లకట్టు మాదిరిగా ఉంటుంది)పై మూడు బోట్ల సాయం (తాళ్లతో కట్టారు)తో పూడిమడక బయల్దేరారు. రాత్రి 11.30 గంటల సమయంలో తాళ్లు తెగిపోయి బోట్ల నుంచి బార్జ్ విడిపోయింది. పూడిమడక శివారు కడపాలేనికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో బార్జ్ సముద్రంలో ఉండిపోయింది. ఈ సమాచారం ముందుగా పూడిమడక మెరైన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. మెరైన్ సిబ్బంది, మత్స్యకారులు కలిసి గురువారం తెల్లవారుజామున ఆ బార్జ్‌ను తీరానికి తీసుకువచ్చారు. దీంతో సురక్షితంగా బయటపడ్డారు.