నలుగురికి జీవిత ఖైదు
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:56 AM
తూర్పు గోదావరి జిల్లా కడియంలో వివాహితపై సామూహిక అత్యాచారం, అనంతరం హత్య చేసి.. శిరోముండనం చేసి కాలువలోకి విసిరేసిన కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
రాజమహేంద్రవరం/కడియం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా కడియంలో వివాహితపై సామూహిక అత్యాచారం, అనంతరం హత్య చేసి.. శిరోముండనం చేసి కాలువలోకి విసిరేసిన కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఎస్పీ నరసింహ కిశోర్ వివరాలను వెల్లడించారు. బుర్రిలంకకు చెందిన రౌతు కస్తూరి (43) అనే వివాహిత నర్సరీల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేది. 2024 అక్టోబరు 15న మధ్యాహ్నం పాఠంశెట్టి రాముడు నర్సరీలోకి ఎప్పటి మాదిరిగానే పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో భర్త ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆచూకీ లేకపోవడంతో అదే నెల 16న ఆమె భర్త పాపారావు కడియం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు గాలిస్తుండగా 17వ తేదీన చొప్పెల్ల లాకుల వద్ద కాలువలో కస్తూరి మృతదేహం లభ్యమైంది. దర్యాప్తులో బుర్రిలంకకు చెందిన నేవర యేసు, వెలుబుడి ప్రవీణ్, లోకిన జయ ప్రసాద్, దాసరి సురేశ్‌లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు జీవిత ఖైదు, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఎనిమిదో అదనపు జిల్లా న్యాయాధికారి వై.బెన్నెం నాయుడు సోమవారం తీర్పు చెప్పారు.