బోరు చేయించిన బైక్ ప్రాణం తీసింది!
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:29 AM
అన్నమయ్య జిల్లా పుంగనూరులో శనివారం రాత్రంతా మోటారు బైక్ నుంచి వెలువడిన పొగ పీల్చి తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు మృతి చెందారు. స్థానికంగా పెను విషాదం నింపిన ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది.
రాత్రంతా గదిలో ఆన్‌లో ఉంచడంతో ఘోరం
బైకు నుంచి వెలువడిన పొగతో ఆగిన ఊపిరి
నిద్రలోనే తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్ల మృతి
పుంగనూరులో పెను విషాదం
మేడపై నిద్రించడంతో భార్యాభర్తలు క్షేమం
పుంగనూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా పుంగనూరులో శనివారం రాత్రంతా మోటారు బైక్ నుంచి వెలువడిన పొగ పీల్చి తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు మృతి చెందారు. స్థానికంగా పెను విషాదం నింపిన ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు కొత్తపేట మార్కెట్ యార్డు వద్ద త్యాగరాజువీధికి చెందిన భజంత్రీ మురళి తన ద్విచక్ర వాహనం పాడవడంతో శనివారం మెకానిక్ వద్ద బోరు చేయించారు. దాన్ని 12 గంటలపాటు కూలింగ్ (స్టార్టింగ్)లో పెట్టాలని సూచించడంతో ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి భోజనం చేశాక ద్విచక్ర వాహనాన్ని ఇంట్లో గదిలోనే స్టార్టుచేసి ఉంచారు. అక్కడే మంచంపై మురళి తండ్రి రామచంద్రయ్య(70), కవల పిల్లలు చందన(7), సరిత(7).. కుమారుడు కార్తీక్(12) కింద చాపపై పడుకుని తలుపు గడియపెట్టి నిద్రపోయారు. మురళి, ఆయన భార్య రేవతి మిద్దెపైన పడుకున్నారు. రాత్రంతా బైకు ఆన్‌లో ఉండటంతో కార్బన్ మోనాక్సైడ్ పొగ ఇల్లంతా నిండిపోయింది. కిటికీలు లేకపోవడంతో పొగ బయటికి వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో అక్కడ పడుకున్న నలుగురూ ఆ విషవాయువు పీల్చి నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. మేడమీద పడుకున్న మురళి ఆదివారం ఉదయం కిందికి దిగి తలుపుకొట్టగా ఎవరూ లేవలేదు.
అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి గదిలో చూడగా తండ్రి, కుమారుడు, కుమార్తెలిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. గట్టిగా కేకలు పెట్టి ఏడవడంతో పరిసర ప్రాంతాల వారు వచ్చి చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, మురళి పెద్ద కుమార్తె సుమబిందు (15) సదుం గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లడంతో బతికిపోయింది. స్థానికులు పెద్దసంఖ్యలో వచ్చి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. చదువుకుంటున్న ముగ్గురు పిల్లలతోపాటు తాత చనిపోవడంతో పుంగనూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. పుంగనూరు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి, మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శోకతప్త హృదయాలతో ఆదివారం సాయంత్రం ఆ నలుగురికీ అంత్యక్రియలు నిర్వహించారు.