Share News

నాలుగు బస్సులు ఢీ

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:07 AM

గేదె అడ్డు వచ్చిందని ఒక బస్సు డ్రైవర్‌ షడన్‌ బ్రేక్‌ వేయడంతో దాని వెనుక వస్తున్న మూడు బస్సులు వరుసగా ఒకదానినొకటి వెనుక నుంచి ఢీకొన్నాయి.

నాలుగు బస్సులు ఢీ

  • 41 మంది విద్యార్థులకు గాయాలు

  • అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

దివాన్‌చెరువు/రాజమహేంద్రవరం అర్బన్‌,/డిండి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గేదె అడ్డు వచ్చిందని ఒక బస్సు డ్రైవర్‌ షడన్‌ బ్రేక్‌ వేయడంతో దాని వెనుక వస్తున్న మూడు బస్సులు వరుసగా ఒకదానినొకటి వెనుక నుంచి ఢీకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. నాలుగూ ప్రైవేటు బస్సులే. ఈ ఘటనలో తెలంగాణలోని నల్లగొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలోని మోడల్‌ స్కూల్‌కు చెందిన 41 మంది విద్యార్థినీవిద్యార్థులతోపాటు ఒక ప్రిన్సిపాల్‌, నలుగురు ఉపాధ్యాయులు, ఒక డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దిండి మోడల్‌ స్కూల్‌కు చెందిన 9, 10 తరగతులతోపాటు ఇంటర్మీడియెట్‌కు చెందిన మొత్తం 109 మంది విద్యార్థినీవిద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు, నలుగురు బస్సు డ్రైవర్లతో ఈనెల 17న రెండు బస్సుల్లో విజ్ఞానయాత్రకు బయలుదేరారు. అరకు, బొర్ర గుహలు, విశాఖ ఆర్‌కే బీచ్‌, సింహాచలం, అన్నవరం దర్శించుకుని మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి రాజానగరం మండలం దివాన్‌చెరువు వద్దకు వచ్చేసరికి గేదె అడ్డురావడంతో ముందు వెళుతున్న ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో ఆ వెనుకే విద్యార్థులతో వస్తున్న రెండు బస్సులు, వాటి వెనుక ఉన్న మరో ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి ఒకదానినొకటి ఢీకొన్నాయి. రాజమహేంద్రవరం, రాజానగరంలకు చెందిన 3 అంబులెన్సుల్లో క్షత గ్రాతులను జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో చాలా మందికి మెడ, తలకు, చేతులు, కాళ్లకు గాయాలవడంతో ఎక్స్‌రే, కొందరికి సీటీ స్కాన్‌ తీసి, ఎవ్వరికీ ఫ్రాక్చర్‌ కాలేదని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం బుధవారం ఉదయం వారంతా స్వస్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ దివ్య చెప్పారు. గాయపడినవారిలో ప్రిన్సిపాల్‌ నారాయణరెడ్డి, ఉపాధ్యాయులు శ్రీలత, జ్యోతి, విజయ్‌, రవి ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసి విద్యార్థుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Updated Date - Jan 22 , 2026 | 04:07 AM