మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గుజరాత్‌లో అరెస్ట్
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:35 AM
పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న గుంటూరు తూర్పు వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాను పోలీసులు అరెస్టు చేశారు.
పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న వైసీపీ నేత
ఫోన్ ఆధారంగా జాడ గుర్తించిన నూజివీడు పోలీసులు
నూజివీడు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న గుంటూరు తూర్పు వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లో ఆయన్ను సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఫోన్ లొకేషన్ ఆధారంగా ముస్తఫా గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. చట్ట నిబంధనలు పూర్తి చేసిన అనంతరం ముస్తఫాను నూజివీడు తీసుకురానున్నట్టు పోలీసులు చెప్పారు. గత నెల 28న ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన పొగాకు వ్యాపారి అభిని నూజివీడు బైపాస్ రోడ్‌లో అడ్డగించి పొగాకు లారీతో సహా అతన్ని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నూజివీడు పోలీస్ స్టేషన్‌లో ముస్తఫా, అతని కుమారుడు బషీర్‌పై అట్రాసిటీ కేసు నమోదైంది. కిడ్నాపైన పొగాకు వ్యాపారి అభిని పోలీసులు వెంటనే కాపాడారు. ఈ వ్యవహారంలో ఐదుగురు నిందితులను గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని నూజివీడు పోలీసులకు జూలై 29న అప్పగించారు. ముస్తఫా, బషీర్ నాటి నుంచి పరారీలో ఉన్నారు.