నాగరాజు అరెస్టు
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:32 AM
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడలోని కృష్ణలంక మాజీ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
సీఐ కుటుంబ సభ్యులకు సిట్ నోటీసు
సుదీర్ఘంగా విచారించిన సిట్ చీఫ్ రవిప్రకాశ్
సాయికృష్ణను ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు?
మార్కాపురంనుంచి ఎవరు తీసుకువచ్చారు?
కృష్ణలంక పీసీలో సీసీ ఫుటేజ్ ఎలా మాయమైంది?
సిట్ అధిపతి ప్రశ్నలకు మౌనమే సమాధానం
నాగరాజు అరెస్టుపై మహిళలు, యువకుల నిరసన
అమరావతి, విజయవాడ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడలోని కృష్ణలంక మాజీ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం అజిత్‌సింగ్ నగర్‌లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంజీ రోడ్డులో ఉన్న ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు తరలించారు. మధ్యా హ్నం 3 గంటల నుంచి ఆయనను అధికారులు విచారించడం మొదలుపెట్టారు. సిట్ చీఫ్ రవిప్రకాశ్ పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు నివేదికలు, వాంగ్మూలాలను దగ్గర పెట్టుకుని విచారణ సాగించారు. 5 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత రెండు గంటల విరామం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ విచారణ మొదలుపెట్టారు. ఏసీపీ లతాకుమారి వాంగ్మూలం ప్రకారం సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చారని తెలుస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజీ మాయం కావటం.. అనాథ శవాల దహనంపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాంకేతిక ఆధారాలను ముందుంచి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించగా, నాగరాజు చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. సాయికృష్ణను ఏ కేసు నిమిత్తం, ఏ తేదీన మార్కాపురం నుంచి అదుపులోకి తీసుకున్నారనే అంశాలపై ఆరా తీశారు. ఈ వ్యవహారంలో ప్రత్యేక రక్షక దళ పోలీసులను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? ప్రైవేటు వాహనాలలో ఎందుకు తరలించారు? విజయవాడ తీసుకొచ్చిన తర్వాత వారి కార్యాలయంలో కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైనా రహస్య ప్రాంతంలో ఎన్ని రోజులు ఉంచారు? అనే కోణంలో లోతైన ప్రశ్నలు సంధించారు.
సాయికృష్ణకు ఏమైనా అనారోగ్యం చేసి ఆసుపత్రికి తరలించారా? ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు? అసలు ఈ అరెస్టు వ్యవహారం ఉన్నతాధికారులకు ముందే తెలుసా? లేదా? అన్న ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. సిట్ అధిపతి రవిప్రకాశ్ నేరుగా ప్రశ్నించినా సీఐ నాగరాజు దేనికీ సూటిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. తాను ఉద్యోగం బాగా చేశానని, తాను కొట్టింది అమాయకుడిని కాదని, ఒక రౌడీషీటర్ కోసం తనను బలి పశువును చేయడం అన్యాయమని వాపోయినట్లు తెలిసింది. సాయికృష్ణ బాధితులకు యూనిఫామ్ వేసుకున్న అధికారిగా న్యాయం చేసేందుకు ప్రయత్నం చేశాను కానీ తాను ఎవరిపైనా అక్రమ చర్యలకు పాల్పడలేదని బదులిచ్చినట్టు తెలుస్తోంది. అయితే ‘అవన్నీ నేను అడగట్లేదు.. నీపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వు’ అని ఐజీ ప్రశ్నించినట్లు తెలిసింది. ‘అంతా మీకు తెలుసు.. అంగీకార పత్రం మీరే రాసుకోండి.. నేను సంతకం పెడతా..’ అంటూ బదులిచ్చిన నాగరాజు ఆ తర్వాత ఏది అడిగినా మౌనంగానే ఉన్నట్లు సమాచారం.
నిరసనలు.. బైఠాయింపు
ఇన్‌స్పెక్టర్ నాగరాజు అరెస్ట్ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయనకు మద్దతుగా అభిమానులు, మహిళలు, యువకులు నిరసన చేపట్టారు. ఆయనను అదుపులోకి తీసుకుంటారన్న సమాచారం తో ఇంటి వద్ద భారీగా గూమిగూడారు. నాగరాజు ఫొటోలతో ప్లకార్డులు పట్టుకుని అరెస్టు చేయవద్దంటూ నినాదాలు చేశారు. నాగరాజు బయటకు వచ్చి వారికి సర్ది చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని విజ్ఞపి చేశారు. అయినా అభిమానులు అక్కడే ఉండిపోయారు. తర్వాత సిట్ రాకతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారుల వాహనాలను కదలనివ్వకుండా అభిమానులు అడ్డుపడ్డారు. వాహనాల ముందు బైఠాయించి సేవ్ పోలీసు, ఇన్‌స్పెక్టర్‌ను బలి పశువును చేయవద్దంటూ నినాదాలు చేశారు. నాగరాజును తరలిస్తున్న వాహనాన్ని అన్ని కూడళ్లలోను అభిమానులు అడ్డుకున్నారు. యువకులు ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. నాగరాజుకు మద్దతుగా నినాదాలు చేస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఇక్కడికి కృష్ణలంక, బాలాజీనగర్, రాణిగారితోట, గీతానగర్ కట్ట ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. నాగరాజు ఉన్న వాహనాన్ని ఏఆర్ గ్రౌండ్ గేటు లోపలకు వెళ్లకుండా నిలువరించారు. పోలీసులు, రోప్ పార్టీలు ఆందోళనకారులను పక్కకు లాగిన తర్వాత వాహన శ్రేణి లోపలకు ప్రవేశించింది. సిట్ అధికారులు నాగరాజును అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ రామలింగేశ్వరనగర్‌లో ఉన్న ఇస్కాన్ ఆవరణలో పరిసర ప్రాంతాల మహిళలు నిరసన తెలిపారు. అలాగే బెంజ్ సర్కిల్ నుంచి ఎంజీ రోడ్డు వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఆ రెండు శవాలపై అనుమానం
గడచిన నెలలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధి నుంచి మొత్తం ఏడు అనాథ శవాలు పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వర్గపురికి వెళ్లాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఆ వివరాలను సిట్‌కు అందజేశారు. 23వ తేదీన వెళ్లిన రెండు శవాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి 7, 7.10 గంటలకు పీఎన్‌బీఎ్‌సలోని 42, 44 ఫ్లాట్‌ఫాంల వద్ద రెండు అనాథ శవాలను పోలీసులే స్వయంగా స్వర్గపురికి తరలించారు. ఆ మర్నాడు వెహికల్ డిపో ఇన్‌చార్జికి లేఖ ద్వారా తెలియజేశారు. ఈ మృతుల వయస్సు 50-55 మధ్య ఉంటుందని తెలిపారు. స్వర్గపురి సిబ్బంది 24వ తేదీన ఒకదాన్ని, 25వ తేదీన రెండో శవాన్ని దహనం చేశారు. అనాథ శవాల తరలింపునకు సంబంధించి ప్రతిసారి వెహికల్ డిపో ఇన్‌చార్జికి ముందుగా లేఖ రాసిన పోలీసులు, 23వ తేదీన మాత్రం తరలించేసిన తర్వాత లేఖ రాయడం అనుమానాలకు తావిస్తోంది. నాగరాజు విచారణ ముగిసిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం నేరుగా వెళ్లి రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను కలిసింది. కేసు వివరాలను, విచారణ ప్రగతిని వివరించింది. కోర్టు సమయం ముగిసిపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రికి రాత్రే నాగరాజును న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అంబటి నుంచి ఆరంభించాలి
ఇన్‌స్పెక్టర్ నాగరాజు విషయంలో అంబటి రాంబాబు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాడు. అసలు ప్రభుత్వం ఈ దర్యాప్తును నాగరాజు నుంచి కాకుండా అంబటి నుంచి మొదలుపెట్టాలి. ఆయనే ఈ మొత్తం వ్యవహారాన్ని సృష్టించాడు. వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు కానీ మంచీచెడూ ఆలోచించడం లేదు.
- నాగభూషణం, తాడేపల్లి
ప్రభుత్వం పునరాలోచించాలి
కృష్ణలంకకు ఇన్‌స్పెక్టర్‌గా నాగరాజు ఉన్నప్పటి పరిస్థితులు, గడచిన 15 రోజులుగా మారిన పరిస్థితులను ఒక్కసారి పరిశీలించండి. మొన్న రాత్రి కానిస్టేబుల్‌పై ఒకరు దాడి చేశాడు. నిన్న రాత్రి బ్లేడ్‌బ్యాచ్ సభ్యుడు తండ్రీకొడుకులను బ్లేడ్‌తో కోశాడు. వాళ్లిద్దరు చావుబతుకుల్లో ఉన్నారు. నిజాయితీ కలిగిన అధికారికి అండగా నిలవాలి. ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించాలి. రెండేళ్ల కాలంలో కృష్ణలంక ప్రాంతంలో గంజాయి, బ్లేడ్‌బ్యాచ్‌లను మొత్తం నిర్మూలించారు. నాగరాజుపై త్వరగా సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌గా నియమించాలి. లేకపోతే కృష్ణలంకలో దారుణమైన పరిస్థితులు మున్ముందు కనిపిస్తాయి.
- రవికుమార్, కృష్ణలంక