Share News

మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:09 AM

‘కృత్రిమ మేధస్సు కృత్రిమంగానే ఉంటుంది. మన మేధస్సు ద్వారానే మంచి ఫలితాలు వస్తాయి. ఏఐ విస్తృతమైతే వావి వరసలు మరిచిపోతారేమోనన్న భయముంది నాకు.

మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

  • రాజకీయ నాయకుల తీరుపై మేధావులు నోరువిప్పాలి

  • ఏఐను సరిగ్గా వాడుకోకపోతే పెనుప్రమాదం

  • సిద్ధార్థ కాలేజీ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవంలో వెంకయ్యనాయుడు

విజయవాడ, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ‘కృత్రిమ మేధస్సు కృత్రిమంగానే ఉంటుంది. మన మేధస్సు ద్వారానే మంచి ఫలితాలు వస్తాయి. ఏఐ విస్తృతమైతే వావి వరసలు మరిచిపోతారేమోనన్న భయముంది నాకు. మీ ముఖం తరహాలోనే ఇంకొకరు మీ ఇంట్లోకి వచ్చే ప్రమాదమూ ఉంది. ఏఐపై మోదీ, చంద్రబాబు, సుందర్‌ పిచాయ్‌ వంటి వారు మాట్లాడారు. ఏఐను నైతిక పద్ధతిలో విలువలతో కూడిన విధంగా ఎలా వినియోగించాలన్నది ఆలోచన చేయాలి. ఏఐ వల్ల జరిగే ప్రమాదాన్ని నిపుణులు గుర్తించి వాటిని నివారించే మార్గాలను కూడా చూడాలి. ఒకప్పుడు సోషల్‌ మీడియా వస్తే అబ్బో అన్నారు.. ఇప్పుడు యాంటీ సోషల్‌ మీడియాగా మారిపోయింది. పైన హెడ్డింగ్‌ అద్భుతంగా ఉంటుంది. లోపల సంబంధం లేని అంశాలుంటాయి. కృత్రిమ మేధ ద్వారా ఎంత మంచి ఉందో అంత చెడూ ఉందని ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో ప్రధాని కూడా చెప్పారు. ఈ చెడును ఏవిధంగా అదుపుచేసి అరికట్టాలన్నది అందరూ ఆలోచన చేయాలి’ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోషల్‌ మీడియా ద్వారా రాజకీయ నాయకులు మత విద్వేషాలను రెచ్చగొడుతూ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, కులాలు, మతాల పేరుతో సమాజంలో చీలికలు తెచ్చే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.విజయవాడలోని పీబీ సిద్ధార్థ కాలేజీ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సిద్ధార్థ ఆడిటోరియంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ వేడుకలను వెంకయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్ధార్థ కాలేజీ దేశ, రాష్ట్ర ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు.


క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో కాలేజీ సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పాతతరం కుటుంబ వ్యవస్థ గురించి పిల్లలకు తెలిసేలా బాధ్యతాయుతంగా నేటి తరం తల్లిదండ్రులు ప్రవర్తించాలని సూచించారు. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు భారతీయ సంప్రదాయాలే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు సిద్ధార్థ కాలేజీకి చెందిన ప్రముఖులను సత్కరించారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ మేకా రమేష్‌బాబు, పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్‌ బోడేపూడి అమరేంద్ర, అకాడమీ చైర్మన్‌ మలినేని రాజయ్య, ఉపాధ్యక్షుడు నిమ్మగడ్డ లలిత్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Updated Date - Feb 22 , 2026 | 05:11 AM