Vijaya Sai Reddy: అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలు!
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:31 AM
వైసీపీ మాజీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి ఆదివారం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భవిష్యత్తులో మీ గతేంటో ఇప్పటికైనా గుర్తించండి
‘ఎక్స్’లో చేసిన పోస్టులో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
వెనెజువెలా అంశాన్ని ముడిపెడుతూ హెచ్చరికలు
ఆ బందీ జగనేనా?.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి ఆదివారం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి. వెనిజువెలాలో భారీ ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా.. ఆ దేశాధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా తీసుకెళ్లిందంటే కారణం ఏమిటి? వారంతా అమ్ముడు పోవడమే కదా!’ అని ఆ పోస్టులో విజయసాయి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించినవేనని చర్చ సాగుతోంది. ఈమధ్య కాలంలో విజయసాయి రాజకీయాలపై మాట్లాడటం లేదు. కానీ, జగన్‌పై తన మనసు విరిగిపోయిందని, ఆయన పిలిచినా వైసీపీలోకి వెళ్లబోనంటూ ఇటీవల ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ వెల్లడించారు. జగన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘కోటరీ’ అని మాట్లాడుతున్నారు. తాజా ట్వీట్‌లోనూ ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. ఎంతటి బలమైన ప్రజా నాయకుడైనా అమ్ముడుపోయిన కోటరీతో జరిగే నష్టమేమిటో ఇప్పటికైనా గుర్తించాలని వెనిజువెలా అధ్యక్షుడి అంశాన్ని ముడిపెడుతూ హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలతో గెలిచిన బలమైన పార్టీగా గుర్తింపు పొందిన వైసీపీ... ఐదేళ్లు తిరిగేలోగా 11 స్థానాలకే పరిమితం కావడాన్ని విజయసాయి పరోక్షంగా ప్రస్తావించారని చెబుతున్నారు.
ప్రజాబలం ఉందని నిరంకుశంగా వ్యవహరిస్తూ కోటరీ ఉచ్చులో పడితే.. జనం నిర్మొహమాటంగా తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. బలమైన వ్యవస్థలు ఉన్నా కోటరీ దెబ్బకు అశక్తులుగా మారడం ఖాయమని తేల్చిచెప్పారు. పదేపదే కోటరీ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా జగన్‌కు విజయసాయి తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే విజయసాయిపై ఆగ్రహంతో ఉన్న జగన్... ఈ హెచ్చరికలను పట్టించుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోటరీపై విజయసాయి ఎన్ని హెచ్చరికలు చేసినా జగన్ వైఖరిలో మార్పు రాదని వైసీపీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి.