Share News

ఆ కోటరీ, ఈ కూటమి ఉన్నన్నాళ్లు జగన్‌కు అధికారం కల్ల!

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:19 AM

జగన్‌కు 15 ఏళ్లు పాలేరులాగా పని చేశాను. కానీ... కోటరీ మాటలు నమ్మి నన్ను పొగబెట్టి బయటకు పంపించడమే ఆయన నాకు ఇచ్చిన రివార్డు.

ఆ కోటరీ, ఈ కూటమి ఉన్నన్నాళ్లు జగన్‌కు అధికారం కల్ల!

  • ఎన్ని పాదయాత్రలు చేసినా అంతే

  • పాలేరులా పని చేస్తే.. పొగపెట్టి పంపేశారు

  • జగన్‌ నాకు ఇచ్చిన రివార్డు ఇదే

  • ప్రలోభాలకు లొంగిపోయానన్నారు

  • జగన్‌ ఆ మాట వెనక్కి తీసుకోవాలి

  • వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డి ధ్వజం

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌కు 15 ఏళ్లు పాలేరులాగా పని చేశాను. కానీ... కోటరీ మాటలు నమ్మి నన్ను పొగబెట్టి బయటకు పంపించడమే ఆయన నాకు ఇచ్చిన రివార్డు. ఒక పాలేరులాగా పనిచేసి నేను పండించినదంతా కోటరీలో ఉన్నవాళ్లు తిన్నారు. ఇప్పటికీ తింటూనే ఉన్నారు. జగన్‌ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్‌ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు’’ అని వైసీపీ మాజీ నేత విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. తాను ప్రలోభాలకు లొంగిపోయినట్లు జగన్‌ ఆరోపించారని సాయిరెడ్డి ఆక్రోశించారు. ప్రలోభాలకు లొంగి ఉంటే లక్షల కోట్లు ఆర్జించేవాడినన్నారు. ఆ మాట వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాలేరులాగా తాను కష్టపడి పండించిన పంటను తింటున్న ‘పంది కొక్కులు’ అంటూ కోటరీపై ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరైన అనంతరం సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీలో నంబర్‌ 2 స్థానంలో ఉండీ లిక్కర్‌ స్కామ్‌ గురించి తెలియదనడం కరెక్ట్‌ కాదేమో అని ఈడీ అధికారులు తనతో అన్నారని సాయిరెడ్డి తెలిపారు. ‘‘ప్రాంతీయ పార్టీల్లో నంబర్‌ 2 ఉండదని అనేకసార్లు చెప్పాను. నేను పార్టీలో ఉన్నప్పుడు కోటరీ నన్ను నంబర్‌ 2గా అంగీకరించలేదు. పార్టీ వదిలిపోయాక... కేసులు చుట్టుముట్టిన తర్వాత వైసీపీ సోషల్‌ మీడియా నన్ను ‘నంబర్‌ 2’ అని ప్రచారం చేస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చాక సంవత్సరం పాటు నాకు జగన్‌ నంబర్‌ 2 స్థానం ఇచ్చారు.


ఆయన హృదయంలో కూడా అదే స్థానం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మనస్సులో నుంచి నేను జారిపోతూ వచ్చాను. పనికి మాలిన కోటరీ వల్లే ఇది జరిగింది. వెన్నుపోటు పొడుస్తానేమోనన్న అభద్రతా భావం కల్పించారు. 2020 నుంచి నన్ను పక్కన పెట్టారు. దీంతో పార్టీలో ఇమడలేక, కోటరీ వేధింపులు తట్టుకోలేక, అవమానాలు భరించలేక పార్టీ వదిలి వెళ్లిపోయాను. ఈ కోటరీ ఉంటే జగన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఈ కూటమి కొనసాగితే జగన్‌ అధికారంలోకి రాలేరు. తగిన వ్యూహాన్ని ఇచ్చే, అమలు చేసే వారు కోటరీలో లేరు. జగన్‌ చుట్టూ ఉన్న వాళ్లంతా ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని సాయిరెడ్డి పేర్కొన్నారు. తాను వందలకోట్లు సంపాదించినట్లుగా జగన్‌ సోషల్‌ మీడియా, ఆయన కోటరీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాను విశాఖలో ఆస్తులు పోగేసుకున్నట్లుగా ‘సిట్‌’ కూడా రిపోర్టు పంపిందన్నారు. ‘అరబిందో ఆస్తులన్నీ నావి అవుతాయా’ అని ప్రశ్నించారు. ఏడాదిపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నానని, ఆ గడువు త్వరలో ముగుస్తుందని తెలిపారు. ‘‘నా కోరికంతా రాజకీయాల్లోకి తిరిగి రావాలి. తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలి. నా మీద దుష్ప్రచారం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలి. ఏ రాజకీయ పార్టీలోనూ చేరను. నా రాజకీయ భవిష్యత్తు త్వరలో ప్రకటన చేస్తాను’’ అని సాయిరెడ్డి తెలిపారు. మోదీ సమర్థ నాయకుడని ప్రశంసించారు. ఏపీలో ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించడంలేదని చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌లో తాను అప్రూవర్‌గా మారే ప్రసక్తే లేదన్నారు. తన పాత్రకు సంబంధించి ఆధారాలు లేనందునే... తనను అరెస్టు చేయలేదని చెప్పారు.


ఔను.. వంద కోట్లు ఇప్పించా!

మిథున్‌ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి రాజ్‌ కసిరెడ్డికి 100 కోట్ల రూపాయలు అరేంజ్‌ చేశారా అని ఈడీ అధికారులు అడిగారు. అవును.. మిథున్‌ రెడ్డి కోరిక మేరకు నేను రికమెండ్‌ చేసిన మాట వాస్తవమే.. అని చెప్పాను. మిథున్‌ రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డికి అరబిందో నుంచి ఆ డబ్బు అప్పుగా ఇప్పించాను. ఇది జగన్‌కు తెలిసే జరిగిందా, 100 కోట్లు అరేంజ్‌ చేయమని జగన్‌ మీకు చెప్పారా.. అని కూడా ప్రశ్నించారు. అయితే, జగన్‌ నాకు చెప్పలేదని స్పష్టం చేశాను. లిక్కర్‌ స్కామ్‌కు కర్త, కర్మ, క్రియ రాజ్‌ కసిరెడ్డి... ఆయనే దీని గురించి చెప్పగలరని ఈడీకి తెలిపాను. ఒకవేళ లిక్కర్‌ స్కామ్‌ అనేదే ఉంటే... అది కచ్చితంగా జగన్‌కు తెలిసి జరిగి ఉండదని చెప్పాను.

- మీడియాతో విజయ సాయిరెడ్డి

Updated Date - Jan 23 , 2026 | 05:19 AM