మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మృతి
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:51 AM
విజయవాడలో ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య(96) ఆదివారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన దుర్గాపురంలోని స్వగృహంలో....
విజయవాడ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య(96) ఆదివారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన దుర్గాపురంలోని స్వగృహంలో ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత పల్నాడు జిల్లాలోని రెంటచింతల మండలం తుమ్మకోట గ్రామంలో వెంకయ్య జన్మించారు. 1991లో గాంధీనగర్‌లో ఐలాపురం పేరుతో హోటల్‌ను నిర్మించారు. అప్పటి నుంచి ఆతిథ్యరంగంలో స్థిరపడ్డారు. వెంకయ్య తొలి నుంచి కాంగ్రె్‌సకు వీరాభిమాని. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నప్పటి నుంచి ఆ పార్టీలోనే చివరి వరకు కొనసాగారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రెండేళ్ల తర్వాత రిటైరయ్యారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. మళ్లీ స్థానిక సంస్థల కోటాలో మండలికి ఎన్నికయ్యారు. కాగా, వెంకయ్య మృతికి ఏపీ సీఎం చంద్రబాబు, సీపీఐ నేత కె.నారాయణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వెంకయ్య మృతదేహాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఆర్టీఐ మాజీ కమిషనర్లు రమణకుమార్, కట్టా జనార్దన్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దర్శించినివాళులర్పించారు.