Share News

ఛీ..దిరి!

ABN , Publish Date - Jul 24 , 2026 | 04:46 AM

కొడుకు చేసిన రోడ్డు ప్రమాదాన్ని కప్పిపుచ్చేందుకు మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు సీదిరి అప్పలరాజు నాటకం ఆడినట్టు పోలీసులు తేల్చారు.

ఛీ..దిరి!

  • రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు

  • అంపోలు జైలుకు మాజీ మంత్రి

  • కొడుకు తప్పును మరొకరిపైకి తోసేశారు

  • మృతుని కుటుంబంతో బేరసారాలు

  • కళ్లెదుటే వ్యక్తి ప్రాణాలు పోతున్నా... వైద్యుడై ఉండీ కనికరం శూన్యం

  • ప్రమాదానికి రెండు రోజుల ముందే కుమారుడికి ఎల్‌ఎల్‌ఆర్‌

  • అయినా, హై-పవర్‌ బైక్‌ చేతికి..

  • యాక్సిడెంట్‌ తర్వాత మాయానికి యత్నం

శ్రీకాకుళం, జూలై 23(ఆంధ్రజ్యోతి): కొడుకు చేసిన రోడ్డు ప్రమాదాన్ని కప్పిపుచ్చేందుకు మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు సీదిరి అప్పలరాజు నాటకం ఆడినట్టు పోలీసులు తేల్చారు. నేరాన్ని మరొకరిపై నెట్టడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం తదితర తీవ్రమైన అభియోగాలపై అప్పలరాజును (ఏ3) పోలీసులు అరెస్ట్‌ చేసి గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ సందర్భంగా పోలీసులు కోర్టుకు ఇచ్చిన రిమాండ్‌ రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అప్పలరాజు కుమారుడు ఆరవ్‌వర్మ (ఏ1) ఈ నెల 6న డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, 8న లెర్నింగ్‌ లైసెన్స్‌ వచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకే, జూలై 10న రాత్రి 8.30 గంటలకు సిద్ధార్థ్‌ త్యాడి (ఏ2) తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై వారి ఇంటికి వచ్చాడు. ఆరవ్‌ ఆ బైక్‌ అడగగా, కొడుకుకు అనుభవం లేదని తెలిసీ అప్పలరాజు మరీ ఆ హై-పవర్‌ బైక్‌ను ఆరవ్‌కు ఇప్పించారు. బైక్‌తో వెళ్లిన ఆరవ్‌ రాత్రి 9.30 గంటల సమయంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పాత ఎన్‌హెచ్‌-5 రోడ్డు పారిశ్రామికవాడ జంక్షన్‌ వద్ద దుబ్బ దానయ్య అనే వ్యక్తిని అతివేగంగా, నిర్లక్ష్యంగా ఢీకొట్టారు.


దానయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆరవ్‌.. సిద్ధార్థకు ఫోన్‌ చేయగా.. అప్పలరాజు, సిద్ధార్థ, పీఏ కృష్ణ కలిసి కారులో అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న దానయ్యను చూసి కూడా, కనికరం చూపలేదు. అస్పత్రికి తరలిస్తే బతికే అవకాశం ఉన్నప్పటికీ వదిలేసి.. గాయపడిన తన కుమారుడు ఆరవ్‌ను కారులో ఎక్కించుకుని చిన్నబాదంలోని సాయిశ్రీనివాస ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పలరాజు ఆదేశాలతో సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ఘటనా స్థలం నుంచి బైక్‌ను మాయం చేయడానికి సిద్ధార్థ (ఏ-2) యత్నించగా, అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికే అప్పలరాజు వేసిన స్కెచ్‌ ప్రకారం.. యాక్సిడెంట్‌ చేసింది తానేనని సిద్ధార్థ వారితో బుకాయించాడు. పోలీసులు వచ్చాక కూడా అదే అబద్ధం చెప్పాడు. అప్పలరాజేమో మరో అడుగు ముందుకేసి.. పోలీసులకు ఫోన్‌ చేసి తన సూపర్‌ వైజర్‌ ‘శీను’ ప్రమాదం చేశాడని తప్పుదోవ పట్టించారు. మృతుడు దానయ్య భార్య నోరు మూయించేందుకు అప్పలరాజు అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆమెను కలిసి రూ. 8.5 లక్షలు ఇస్తామని బేరం కుదుర్చుకుని, రూ. 1.5 లక్షలు అడ్వాన్సుగా కూడా చెల్లించారు. పోలీసుల దర్యాప్తులో అప్పలరాజు కుట్ర మొత్తం సీసీటీవీ ఫుటేజీల ద్వారా బట్టబయలైంది. ప్రమాదానికి ముందు ఆరవ్‌ బైక్‌కు పెట్రోల్‌ కొట్టించిన దృశ్యాలు, ఆ తర్వాత టోల్‌ ప్లాజా వద్ద పలుమార్లు అప్పలరాజు కారు వెళ్లిన దృశ్యాలను పోలీసులు సేకరించారు.


కుమారుడు ఉన్న జైలుకే...

అప్పలరాజును పలాస స్టేషన్‌లో బుధవారం రాత్రి 12.10 నుంచి 1.30 వరకు విచారించగా ఆయన నేరాన్ని అంగీకరించారు. కానీ వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారు. జ్వరంగా ఉందని అప్పలరాజు తెలపడంతో, ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. గురువారం సాయంత్రం పలాస కోర్టులో హాజరుపరిచారు. తన కుమారుడు నీట్‌ ప్రవేశ పరీక్ష రాశాడని, తాను స్వయంగా తీసుకువెళ్లి వైద్య కళాశాలలో చేర్పించాల్సి ఉన్నదని విచారణ సందర్భంగా మెజిస్ట్రేట్‌కు ఆయన తెలిపారు. యాక్సిడెంట్‌ ఘటనలో అంబులెన్స్‌ను తానే పిలిపించానని, గాయపడి రోడ్డు మీద పడి ఉన్న వ్యక్తికి స్వయంగా సీపీఆర్‌ చేశానని కోర్టుకు తెలిపారు. వాస్తవంగా ప్రమాదం విషయం తెలియగానే ఘటనాస్థలికి వెళ్లిన సీదిరి.. కుమారుణ్ణి కాపాడుకోవడంపై తప్ప.. అక్కడ రోడ్డు మీద పడి ఉన్న వ్యక్తిని కాపాడటానికి ఎక్కడా ప్రయత్నించలేదు. వాస్తవం ఇది కాగా, కోర్టులో మరోలా చెప్పారు. అప్పలరాజు అభ్యర్థనను తోసిపుచ్చి, 14 రోజుల రిమాండ్‌కు న్యాయాధికారి ఆదేశించారు. పోలీసులు శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలుకి ఆయనను తరలించారు. ఇప్పటికే కుమారుడు ఆరవ్‌ వర్మ, సిద్ధార్థ త్యాడి ఇదే జైలులో ఉన్నారు. కాగా, సీదిరి అరెస్టు సందర్భంగా టెక్కలి వైసీపీ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌... పలాసలో కార్యకర్తలతో హంగామా చేశారు. దీనిపై 132, 126(2), 223, 351(2), 285 రెడ్‌ విత్‌ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురువారం పోలీసు బలగాలు.. నియోజకవర్గాల వారీగా వైసీపీ నాయకులను హౌస్‌అరెస్ట్‌ చేశాయి. పలాసలో 144 సెక్షన్‌ విధించాయి.

Updated Date - Jul 24 , 2026 | 04:49 AM