Share News

మాజీ మంత్రి ‘రియల్‌’ సంపాదన

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:13 AM

జగన్‌ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన అప్పటి ఒక మంత్రి.. తన ప్రాంతం పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసే వ్యక్తుల నుంచి బినామీలు, కుటుంబ సభ్యుల ...

మాజీ మంత్రి ‘రియల్‌’ సంపాదన

  • 200కిపైగా లావాదేవీలు.. రూ.50 కోట్లకుపైగా ఆర్జన

  • ఉమ్మడి చిత్తూరులో స్థిరాస్తి వ్యాపారులపై ఒత్తిళ్లు

  • ఒక్కో వెంచర్‌ నుంచి 2-3 ప్లాట్లు స్వాహా

తిరుపతి(టీటీడీ), జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన అప్పటి ఒక మంత్రి.. తన ప్రాంతం పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసే వ్యక్తుల నుంచి బినామీలు, కుటుంబ సభ్యుల పేరుతో భారీగా స్థలాలు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. వాటి విక్రయాల ద్వారా ఆయన భారీగా సొమ్ము వెనకేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఆ సొమ్ము రూ.50 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. నిత్యం ఇతరులపై నోరుపారేసుకునే ఆ మాజీ మంత్రి నిర్వహించిన శాఖల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. నియోజకవర్గ పరిధిలో నాడు పెద్దఎత్తున వెంచర్లు వేశారు. వాటి స్థాయిని బట్టి తనకు ప్లాట్లు ఇవ్వాలని స్థిరాస్తి వ్యాపారులపై ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. ఒక్కో వెంచర్‌ నుంచి 2-3 ప్లాట్లు తన బినామీ, కుటుంబసభ్యుల పేరుతో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత వాటిని ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. మొత్తం 200 వరకు లావాదేవీలు చేసినట్లు ఆరోపణలున్నాయి. వీటిలో తిరుత్తణిలోని తన బినామీ పేరుతోనే 150 వరకు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. విక్రయాలకు పాల్పడిన డాక్యుమెంట్ల ప్రభుత్వ విలువే రూ.5 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. తన పేరుతోనూ 25కిపైగా స్థలాలకు రిజిస్ర్టేషన్‌ చేయించుకుని అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ధర ప్రకారం.. ఆ డాక్యుమెంట్ల విలువ రూ.8 కోట్ల వరకు ఉండగా మార్కెట్‌ ధర రూ.25 కోట్లకుపైగా ఉంది. తన కుటుంబ సభ్యుల పేరుతో మరో 10 వరకు లావాదేవీలు జరిగాయి. మార్కెట్‌లో వీటి ధర ప్రస్తుతం రూ.10 కోట్లకుపైగా ఉంది. ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.

Updated Date - Jun 04 , 2026 | 05:13 AM