Share News

ఈడీ ముందు హాజరైన కారుమూరి మాజీ పీఏ

ABN , Publish Date - Jul 08 , 2026 | 04:43 AM

వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు గతంలో పీఏగా పనిచేసిన అడ్డగర్ల శ్రీమన్నారాయణ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.

ఈడీ ముందు హాజరైన కారుమూరి మాజీ పీఏ

  • మద్యం అక్రమ రవాణా కేసులో హైదరాబాద్‌ పిలిపించిన అధికారులు

  • నిన్న, మొన్న ఈడీ ఆఫీసులో విచారణ

  • మరికొందరికి శ్రీముఖాలు అందుతాయని ప్రచారం.. వైసీపీ నాయకుల్లో ఆందోళన

తణుకు రూరల్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు గతంలో పీఏగా పనిచేసిన అడ్డగర్ల శ్రీమన్నారాయణ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా వ్యవహారంలో సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌ ఈడీ కార్యాలయంలో ఆయన్ను అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో కారుమూరి కుమారుడు సునీల్‌ను ఇప్పటికే ఈడీ అరెస్టు చేయడంతో ఆయన జైల్లో ఉన్నారు. సునీల్‌ బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా.. శ్రీమన్నారాయణ, సునీల్‌ ఖాతాల నడుమ రూ.40 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీనిపై ప్రశ్నించేందుకే శ్రీమన్నారాయణను పిలిచారు. తణుకు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ నాయకుడు తనకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పదవి వచ్చినందుకు అప్పట్లో పార్టీ పెద్దలకు, కార్యాలయం ఖర్చుల పేరుతో రూ.కోట్లలో వసూలు చేసి ఆ మొత్తాన్ని సునీల్‌ బ్యాంకు ఖాతాకు జమ చేసినట్లు తెలుస్తోంది. ఈ నాయకుడికి కూడా ఈడీ నుంచి శ్రీముఖం అందనుందని ప్రచారం జరుగుతోంది.


మాజీ వైసీపీ నేత వీడియోల కలకలం

కారుమూరి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు.. పుచ్చుకున్న ముడుపులను ఆయన తన ఖాతాతో పాటు కుమారుడు సునీల్‌ ఖాతాల్లో జమ చేయించుకునే వారని వైసీపీ మాజీ నాయకుడొకరు తాజాగా విడుదల చేసిన వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఈ నాయకుడు అప్పట్లో కారుమూరికి వెన్నంటి ఉండి, తర్వాత వైసీపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అలా లావాదేవీలు జరిపినవారికి ఈడీ ఇప్పుడు నోటీసులిచ్చి విచారణకు పిలుస్తుండడంతో సదరు వ్యక్తుల్లో ఆందోళన మొదలైంది. వీరిలో పలువురు ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం.

Updated Date - Jul 08 , 2026 | 04:44 AM