అవును.. లబ్ధిపొందాం!
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:19 AM
’వైసీపీ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మద్యం సరఫరా కాంట్రాక్టు కోసం ఎవరో సంప్రదిస్తే సిఫారసు చేశాను.. కాంట్రాక్టు పొందిన తర్వాత డబ్బుల్లేవన్నారు.. మా అబ్బాయి కారుమూరు సునీల్ పెట్టుబడి సర్దుబాటు చేశాడు..
మద్యం రవాణా వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరు అంగీకారం!!
హైదరాబాద్‌లో 4 గంటలపాటు సిట్ విచారణ
మంత్రి హోదాలో కాంట్రాక్టరుకు సిఫారసు చేశా
డబ్బుల్లేవనడంతో మేమే పెట్టుబడి పెట్టాం
అందుకు ప్రతిఫలమే తీసుకున్నాం: కారుమూరు
అమరావతి/హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ’వైసీపీ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మద్యం సరఫరా కాంట్రాక్టు కోసం ఎవరో సంప్రదిస్తే సిఫారసు చేశాను.. కాంట్రాక్టు పొందిన తర్వాత డబ్బుల్లేవన్నారు.. మా అబ్బాయి కారుమూరు సునీల్ పెట్టుబడి సర్దుబాటు చేశాడు.. అందుకు ప్రతిఫలంగా మద్యం సరఫరా కాంట్రాక్టరు మాకు డబ్బులు చెల్లించాడు’ అని మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సిట్ అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది. జగన్ హయాంలో మద్యం సరఫరా ఆర్డర్లలో రూ.3500 కోట్ల స్కాం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇదే మద్యాన్ని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి అప్పటి ప్రభుత్వ లిక్కర్ షాపులకు రవాణా చేసే టెండర్లలోనూ భారీ కుంభకోణం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ బాగోతాన్ని తేల్చే బాధ్యతను విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అప్పగించింది. 2019కు ముందు టీడీపీ ప్రభుత్వంలో ఒక్కో మద్యం కేసు సరఫరాకు రవాణా చార్జీ రూ.13 మాత్రమే ఉండగా.. జగన్ సర్కారు వచ్చాక 2020 తర్వాత దానిని రూ.34కు పెంచారు. తద్వాకా వైసీపీ లిక్కర్ ముఠా సుమారు రూ.400 కోట్ల వరకూ కొల్లగొట్టినట్లు విజిలెన్స్ ప్రాథమికంగా తేల్చింది. వైసీపీ నేతలు ప్రాంతాల వారీగా బినామీలను ముందుంచి కొల్లగొట్టారని నివేదించింది. దీంతో ఈ అంశాన్ని ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 10న కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రంగంలోకి దించింది. సిట్ లోతుగా ఆరా తీయడంతో మద్యం స్కాంలో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డికి చెందిన ముసుగు సంస్థ ‘సిగ్మా లాజిస్టిక్స్’ పాత్ర వెలుగులోకి వచ్చింది. మొత్తం దందా ఇక్కడి నుంచే మొదలై.. అప్పటి వైసీపీ పెద్దల ఆదేశాలతో జిల్లాల్లోని కీలక వైసీపీ నేతలు సబ్ లీజులు దక్కించుకున్నట్లు బయటపడింది. రాయలసీమలో చిత్తూరు జిల్లాకు చెందిన విజయానందరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. గుంటూరు ప్రాంతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఉభయ గోదావరిలో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు లబ్ధి పొందినట్లు తేలింది. విచారణ నిమిత్తం కారుమూరుకు, ఆయన కుమారుడు సునీల్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. అనారోగ్య కారణాలతో తాను విజయవాడకు రాలేకపోతున్నానని నాగేశ్వరరావు చెప్పడంతో సిట్ అధికారులు హైదరాబాద్ వెళ్లి ఆయన్ను ఆయన ఇంట్లోనే ప్రశ్నించారు. ఎస్పీ, ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటలపాటు విచారించింది. ఈ సందర్భంగా తాము మద్యం రవాణా కాంట్రాక్టుతో లబ్ధి పొందామని.. అయితే కాంట్రాక్టరును సిఫారసు చేసినందుకు ప్రతిఫలంగా కాకుండా.. పెట్టుబడి పెట్టి అందుకు తగిన మొత్తం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సిట్ అధికారులు అదే విషయాన్ని నమోదు చేసుకున్నారు. కారుమూరి వయసు 60 ఏళ్లు పైబడి ఉండడంతో ఆయన కోరిన విధంగా హైదరాబాద్‌లో విచారించి వాంగ్మూలం రికార్డు చేశామని, అవసరమైతే మరోసారి విచారిస్తామని వారు మీడియాకు తెలిపారు. ఆయన కుమారుడు సునీల్‌పైనా కేసు నమోదైందని, ఆయన్ను విజయవాడ సిట్ కార్యాలయంలో విచారిస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సిట్ విచారణకు సునీల్ తప్పనిసరిగా హజరుకావలసిందేనని చెప్పారు. అయితే తనకు వైరల్ జ్వరం వస్తోందని, సిట్ ముందుకు వచ్చేందుకు ఆయన కొంత సమయం కోరినట్లు తెలిపారు.