Former Minister: మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ కన్నుమూత
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:34 AM
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కన్ను మూశారు.
శ్రీకాకుళం, అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కన్ను మూశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఆదివారం తన నివాసంలో కిందపడిన ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 2024 సెప్టెంబరులో ఆయన కిందపడడంతో మెదడుకు సంబంధించి శస్త్ర చికిత్స జరిగింది. ఆదివారం ఆయన మళ్లీ కిందపడ్డారు. వయోభారం, తాజా గాయాల నేపథ్యంలో ఆయన పరిస్థితి విషమంగా మారి కన్నుమూశారు.
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
శ్రీకాకుళం రాజకీయాల్లో గుండ అప్పల సూర్యనారాయణ తనదైన ముద్ర వేశారు. 1981లో శ్రీకాకుళం మున్సిపాల్టీ వైస్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి 1985 నుంచి 2004 వరకు వరుసగా నాలుగుసార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసి జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2014లో ఆయన సతీమణి లక్ష్మీదేవి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంగళవారం శ్రీకాకుళంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల టీడీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సూర్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.