ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసిన దేవ్‌జీ
ABN , Publish Date - May 14 , 2026 | 05:48 AM
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ బుధవారం కోరుట్లలో ఇంటర్ పరీక్ష రాశారు.
కోరుట్ల, మే 13(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ బుధవారం కోరుట్లలో ఇంటర్ పరీక్ష రాశారు. దేవ్‌జీ 1983-85 విద్యా సంవత్సరంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. ఆ సమయంలో విప్లవ భావజాలానికి ఆకర్షితుడై రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్‌గా పనిచేశారు. అప్పుడు జరిగిన ఇంటర్ పరీక్షల్లో తెలుగు సబ్జెక్టులో దేవ్‌జీ ఫెయిల్ అయ్యారు. అనంతరం మావోయిస్టు పార్టీలో చేరి జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇటీవల ఇంటర్ బోర్డు అనుమతి తీసుకొని కోరుట్లలోని మాస్ట్రో జూనియర్ కళాశాలలో సప్లిమెంటరీ పరీక్ష రాశారు. పరీక్షకు వెళ్తున్న సమయంలో దేవ్‌జీ విలేకరులతో మాట్లాడుతూ.. నిరుపేదలకు న్యాయసేవలు అందించడానికి ఇంటర్ పాసై లాసెట్ రాసి న్యాయవాదిని అవుతానని తెలిపారు.