Share News

15 ఏళ్ల తర్వాత ‘ఆజాదీ’ 68 కేసుల నుంచి బయటపడి..

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:36 AM

15 ఏళ్ల జైలు జీవితం...68 కేసులు! ఎట్టకేలకు వాటి నుంచి బయటపడ్డాడు మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలియాస్‌ ఆజాద్‌.

15 ఏళ్ల తర్వాత ‘ఆజాదీ’ 68 కేసుల నుంచి బయటపడి..

  • స్వగ్రామానికి మావోయిస్టు ఆజాద్‌

హరిపురం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): 15 ఏళ్ల జైలు జీవితం...68 కేసులు! ఎట్టకేలకు వాటి నుంచి బయటపడ్డాడు మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలియాస్‌ ఆజాద్‌. పాతికేళ్ల అజ్ఞాతవాసం తర్వాత ప్రభుత్వం ఎదుట ఆజాద్‌ లొంగిపోయాడు. అయితే, ఒడిశా పోలీసులు అక్కడి కేసుల్లో విచారణ కోసం తీసుకెళ్లి, ఇన్నాళ్లుగా అక్కడి జైలులో నిర్బంధించారు. ఆయనపై ఒడిశాలో పెండింగ్‌లో ఉన్న కేసులను కోర్టు కొట్టివేయడంతో బుధవారం శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని స్వగ్రామం నల్లబొడ్లూరు గ్రామానికి ఆజాద్‌ చేరుకున్నాడు. కేశవరావు చిన్నతనంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై పీపుల్స్‌వార్‌లో చేరాడు. ఆజాద్‌ పేరుతో మావోయిస్టు ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, వంశధార డివిజనల్‌ కమిటీ సెక్రటరీగా, ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ ముఖ్య నేతగా పనిచేశాడు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 2011లో లొంగిపోయాడు. ఆంధ్రాలో 16, ఒడిశాలో 52 కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఒడిశా పోలీసులు అరెస్ట్‌ చేసి భువనేశ్వర్‌లోని జార్పడా జైలుకు తరలించారు. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టు ఆయనపై ఉన్న కేసులన్నింటిలో విచారణ జరిపి, చివరకు నిర్దోషిగా నిర్ధారించింది.

Updated Date - Aug 20 , 2026 | 04:37 AM