కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:48 AM
టీడీపీ సీనియర్ నాయకుడు, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి(82) శనివారం కన్నుమూశారు.
సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
కుటుంబ సభ్యులకు ఫోన్‌లో పరామర్శ
అనంతపురం క్రైం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్ నాయకుడు, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి(82) శనివారం కన్నుమూశారు. కొంతకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. టీడీపీ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా సుమారు దశాబ్దకాలం పనిచేశారు. 2009లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కినా, కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో మరోమారు బరిలోదిగి విజయం సాధించారు. 2014-19 మధ్య కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లికి తరలించారు. టీడీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉన్నం మరణవార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఉన్నం కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారని, కార్యకర్తలకు హనుమంతరాయ చౌదరి స్ఫూర్తివంతమైన నాయకుడని కొనియాడారు.