పవన్‌ను విమర్శించే అర్హత వైసీపీకి లేదు: చినరాజప్ప
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:03 AM
‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కాపు సామాజికవర్గానికి ఒరిగిందేమీలేదు. వైసీపీకి పవన్ కల్యాణ్‌ని విమర్శించే అర్హత లేదు’ అని మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
పెద్దాపురం, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కాపు సామాజికవర్గానికి ఒరిగిందేమీలేదు. వైసీపీకి పవన్ కల్యాణ్‌ని విమర్శించే అర్హత లేదు’ అని మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశయాల ప్రకారం కాపులకు మళ్లీ పూర్వవైభవం తెచ్చేలా నిధులు, రిజర్వేషన్లపై చర్చిస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో వైసీపీ ఇన్‌చార్జ్ దొరబాబుకు ఉన్న వ్యక్తిగత, ఆర్థిక వివాదాల వల్లే కావాలని నా కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 40 ఏళ్లుగా మచ్చలేని రాజకీయం చేస్తున్న నాపై చౌకబారు విమర్శలు మానుకోవాలి. పెద్దాపురం, సామర్లకోటలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి నిరోధకులు ఎన్ని అడ్డంకులు స్పష్టంచినా వెనక్కి తగ్గేది లేదు. కూటమి ప్రభుత్వం రాగానే పెద్దాపురం నియోజకవర్గంలో ఆగిపోయిన ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తున్నాం’ అని అన్నారు.