జగన్ మాజీ సీపీఆర్‌వో శ్రీహరి అరెస్ట్
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:29 AM
మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్‌వో, వైసీపీ రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
అమరావతి/కుప్పం, ఏప్రి ల్ 29 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్‌వో, వైసీపీ రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బెంగళూరుకు వెళ్లి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కుప్పం తీసుకొచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇటీవల శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఆదేశాలు ఇవ్వగా, హైకోర్టు వీటిని సస్పెండ్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టులోనూ శ్రీహరికి ఊరట లభించలేదు. ఈ క్రమంలో ఆయన్ను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు.
నేడు హైకోర్టులో విచారణ
పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు మరోమారు అరెస్ట్ చేశారని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కుప్పం అర్బన్ పోలీసులు వేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. వ్యాజ్యంపై గురువారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్ సుభేందు శమంత అన్నారు. అంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్, ఇతర నిందితులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారన్నారు.