నేడు కర్నూలుకు మాజీ ముఖ్యమంత్రి
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:24 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు.
జైలులో ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న జగన
కర్నూలు/కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు. కర్నూలు జిల్లాలోని పంచలింగాల వద్ద సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని పరామర్శించడానికి వస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 10.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకొని రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12.30 గంటలకు జైలు వద్దకు చేరుకుంటారు. 12.30 నుంచి 1.30 వరకు ఎమ్మెల్యే విరుపాక్షిని పరామర్శిస్తారు. 1.30 గంటలకు జైలు నుంచి బయలుదేరి 2.10 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి 2.20 గంటలకు బెంగళూరుకు బయలుదేరనున్నారు. ఇటీవల చిప్పగిరి మండలంలోని నేమకల్లు, సంగాల గ్రామాల్లో టీడీపీ నాయకులపై దాడి, దళిత మహిళపై అనుచితంగా ప్రవర్తించడంతో టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఎమ్మెల్యే విరూపాక్షి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను పరామర్శించడానికి వైఎస్ జగన వస్తున్నారు.
ములాఖతకు మాత్రమే అనుమతి
ఫ ర్యాలీలు, రోడ్‌షోలు నిషేధం
ఫ ఎస్పీ విక్రాంత పాటిల్
కర్నూలు క్రైం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటనలో ములాఖతకు మాత్రమే అనుమతి ఉందని ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు. బుధవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పంచలింగాల సబ్‌జైలులో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షిని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి గురువారం కర్నూలులో పర్యటన నేపథ్యంలో ఆయనకు కల్పించే బందోబస్తు తదితర వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆదోని ఎమ్మెల్యేను పరామర్శించడానికి వస్తున్నారని వైసీపీ నంద్యాల జిల్లా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విన్నవించారని చెప్పారు. ఎంత మంది వస్తారనేది సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. ములాఖత నియమ నిబంధనల మేరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. ములాఖతకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి కర్నూలు మీదుగా పంచలింగాల సబ్‌జైలుకు వెళ్లే మార్గంలో కాన్వాయ్‌కు, ములాఖత వద్ద బందోబస్తు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని కోరారన్నారు. వారు అడిగిన విధంగానే కాన్వాయ్‌కు ములాఖత వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి సమావేశాలు, గుంపులు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆదేశించారు. హైవే మార్గంలో పలు పాఠశాలలు, కళాశాలలు, హాస్పిటల్స్ ఉన్నాయని, వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పోలీసులు అనుమతులు లేని బహిరంగ సభలు, రోడ్‌షోలు పెద్ద ఎత్తున గుమి కూడే కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎస్పీ హెచ్చరించారు. పర్యటన సందర్బంగా పోలీసు శాఖ విధించిన షరతులు ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన పర్యటన మొత్తం వీడియో, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు. 30 పోలీస్ యాక్టు అమలులో ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రాఘవేంద్ర ఉన్నారు.