సీదిరి అరెస్ట్
ABN , Publish Date - Jul 23 , 2026 | 04:58 AM
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
కుమారుడ్ని తప్పించేందుకు కుట్ర
మరొకరిని ఇరికించిన మాజీ మంత్రి
రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలు తారుమారు.. పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నం
మరోవైపు మృతుడి భార్యతో కేసు రాజీకి యత్నాలు
సాంకేతిక ఆధారాలతో వాస్తవాలు వెలుగులోకి
ముందస్తు బెయిల్ పిటిషన్లపై కోర్టులో దక్కని ఊరట
శ్రీకాకుళం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఒక అమాయకుడి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, అసలు నిందితుడైన తన కుమారుడిని తప్పించేందుకు కుట్ర పన్నడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం, తన అనుచరుడిని కేసులో చేర్చేలా నాటకానికి తెరతీసిన వ్యవహారంలో సీదిరి అప్పలరాజుపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన సోంపేట కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు వరుసగా వాయిదా పడుతుండటం.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం కావడంతో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టయ్యారు. పలాసలోని ఆయన స్వగృహంలో ఉండగా అదనపు ఎస్పీ రమణ, డీఎస్పీలు భవానీ, వివేకానంద, పోలీసులు వెళ్లారు. బుధవారం రాత్రి 7.20 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడైన సీదిరి కుమారుడు ఆరవ్ వర్మ, వీరికి సహకరించిన అనుచరుడు సిద్ధార్థ్ త్యాడి ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వారిద్దరు దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను బుధవారం సోంపేట కోర్టు కొట్టివేసింది.
కాశీబుగ్గలో హైడ్రామా
అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నాక ఆయన సతీమణి, రెండో కుమారుడుతో పా టు టెక్కలి వైసీపీ నేత పేరాడ తిలక్, అనుచరులు కాశీబుగ్గ స్టేషన్ వద్దకు వచ్చారు. కొద్దిసేపు మూడు రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీ చేశారు.