Share News

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి

ABN , Publish Date - May 30 , 2026 | 04:21 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (84) ఇకలేరు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో...

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి

  • వయోభారంతో హైదరాబాద్‌లో కన్నుమూత

  • పలువురి నివాళి... రేపు పావులూరులో అంత్యక్రియలు

పావులూరు(ఇంకొల్లు), బాపట్ల, మే 29(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (84) ఇకలేరు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. వెంకటరెడ్డి 1940 జూలై 10న అప్పటి గుంటూరు జిల్లా(ప్రస్తుతం బాపట్ల జిల్లా), ఇంకొల్లు మండలం, పావులూరు గ్రామంలో జన్మించారు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1967లో పర్చూరు నుంచి తొలిసారిగా ఐఎన్‌సీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1972, 1978 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన... 1991 ఉపఎన్నిక, 1994లో పర్చూరు నుంచి మళ్లీ గెలిచారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో బాపట్ల ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్‌, రోశయ్య హయాంలో మంత్రిగా చేశారు. 2016లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2020లో వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డి వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. గాదె మృతదేహాన్ని శనివారం స్వగ్రామం పావులూరుకు తరలించి, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Updated Date - May 30 , 2026 | 04:22 AM