Share News

చిన్నప్పన్న అరెస్టు

ABN , Publish Date - May 26 , 2026 | 04:46 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో స్పెషల్‌ లైజనింగ్‌ అధికారి/స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన కాదూరు చిన్నప్పన్న (36)ను ఏసీబీ అరెస్టు చేసింది.

చిన్నప్పన్న అరెస్టు

  • అక్రమాస్తుల కేసులో అదుపులోకి..

  • వైసీపీ హయాంలో ఏపీ భవన్‌లో విధులు

  • 2023, 2024ల్లో భారీగా స్థలాలు, ఫ్లాట్లు

  • సోదాల్లో గుర్తించిన ఏసీబీ అధికారులు

విశాఖపట్నం, అమరావతి, మే25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో స్పెషల్‌ లైజనింగ్‌ అధికారి/స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన కాదూరు చిన్నప్పన్న (36)ను ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే అభియోగంపై సోమవారం అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఇప్పటికే ఒకసారి చిన్నప్పన్న అరెస్టు అయిన విషయం తెలిసిందే. అప్పట్లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వద్ద పీఏగా పనిచేసిన చిన్నప్పన్న, ఆయన ఆశీస్సులతో ఏపీ భవన్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌గా ఢిల్లీలో పనిచేశారు. ఈ సమయంలో చిన్నప్పన్న విపరీతంగా ఆస్తులు వెనుకేసినట్టు ఫిర్యాదులు అందటంతో విశాఖ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. భారీగా ప్లాట్లు, ఫ్లాట్లు ఆయన కొనుగోలు చేసినట్టు సోదాల్లో గుర్తించారు. ఆ వివరాలను విశాఖ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సోమవారం మీడియాకు తెలిపారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలసకు చెందిన చిన్నప్పన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డికి దగ్గరయ్యారు. 2019 అక్టోబరు 10న ఏపీ భవన్‌లో స్పెషల్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌/స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమితుడయ్యారు. నెలకు రూ.75వేలు వేతనం, ఇతర అలవెన్సులు ఇచ్చేలా మూడేళ్ల కాలానికి అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2022 అక్టోబరులో పదవీకాలం పూర్తవడంతో మరో రెండేళ్లపాటు పొడిగించింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో పదవి నుంచి ఆయన వైదొలిగారు.


చిన్నప్పన్న ప్రభుత్వ పదవిని అడ్డంపెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందడంతో విశాఖ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఉన్నతాధికారుల అనుమతితో దర్యాప్తు ప్రారంభించారు. చిన్నప్పన్న ఇతర రాష్ట్రాల్లో గడుపుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటుండడంతో ఏసీబీ అధికారులు గట్టిగా నిఘా పెట్టారు. ఆదివారం మండపేట వస్తున్నట్టు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు అక్కడ మాటువేసి పట్టుకున్నారు. చిన్నప్పన్న స్వగ్రామం పాములవలసతోపాటు విశాఖపట్నం, మండపేట, తాడేపల్లి, కృష్ణలంక, విజయవాడలోని ఆయన నివాసాలు, కుటుంబసభ్యులు, బంధువుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 2023లో తగరపువలసలో 160 గజాల ప్లాట్లు ఐదు, 2024లో అనకాపల్లి జిల్లా పరవాడ మండ లం మర్రిపాలెంలో 160 గజాల ప్లాట్‌లు మూడు, రుషికొండలో బ్లూ నైల్‌ డెవలపర్స్‌ నిర్మిస్తున్న పెబ్లే బీచ్‌ టవర్స్‌లో ఫ్లాట్‌, కేపీఆర్‌ రెసిడెన్సీలో ఫ్లాట్‌ కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. జిరోదా బ్రోకింగ్‌ కంపెనీలో రూ.45.15 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు బయటపడింది. ఆస్తుల విలువ రూ.3కోట్లకుపైగా ఉండడంతో ఆయనను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 2వారాలు రిమాండ్‌ విధించడంతో విశా ఖ కారాగారానికి తరలించారు.

Updated Date - May 26 , 2026 | 04:47 AM