Share News

ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:48 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పనిచేసిన 1965 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి హెచ్‌జే దొర (83) కన్నుమూశారు.

ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత

  • కొద్దికాలంగా కిడ్నీల సమస్యతో ఇబ్బందులు

  • నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస

  • బాబు సంతాపం.. నేడు అంత్యక్రియలు

హైదరాబాద్‌/నిమ్స్‌, అమరావతి, శ్రీకాకుళం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పనిచేసిన 1965 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి హెచ్‌జే దొర (83) కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలానికి చెందిన ఆయన కొద్దికాలంగా బీపీ, బ్రాంకియల్‌ ఆస్థమా, కిడ్నీ వ్యాఽధులతో బాధపడుతున్నారు. రెండేళ్లుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. శుక్రవారం ఉదయం కూడా ఆయన నిమ్స్‌కు వచ్చి డయాలసిస్‌ చేయించుకొని ఇంటికి వెళ్లారు. కానీ, ఆ కొద్ది సేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. కుటుంబసభ్యులు వెంటనే నిమ్స్‌కు తరలించారు. అన్ని రకాల చికిత్సలు అందించినా ఫలితం లేకపోయిందని, హెచ్‌జే దొర తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. విషయం తెలియగానే తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ విజయ్‌కుమార్‌, నగర పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ నిమ్స్‌ ఆస్పత్రికి చేరుకొని నివాళులర్పించారు. దొర భౌతికకాయాన్ని బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 3లోని ఆయన నివాసానికి చేర్చారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.


నక్సల్స్‌పై ఉక్కుపాదం..

హెచ్‌జే దొర ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్‌ చదివారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా 1996లో బాధ్యతలు స్వీకరించిన ఆయన ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత సీఐఎ్‌సఎఫ్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ గా, ఏపీ సీఐడీ చీఫ్‌గానూ పనిచేశారు. నక్సల్స్‌పై ఉక్కుపాదం మోపడానికి దొర ఆధ్వర్యంలోనే అప్పట్లో గ్రేహౌండ్స్‌ విభాగం ఏర్పడింది. అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబుకు హెచ్‌జే దొర అత్యంత నమ్మకస్తులని పేరు. నక్సల్స్‌ ఉద్యమాన్ని అణచివేయడానికి అప్పట్లో దొర గ్రామస్ధాయిలో ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేశారు. నాటి పీపుల్స్‌ వార్‌ హిట్‌ లిస్టులో దొర మొదటి వరుసలో ఉండటంతో ఆయన రిటైర్‌ అయినా కూడా చివరి వరకు హై సెక్యూరిటీ జోన్‌లోనే ఉన్నారు. వివిధ హోదాల్లో పనిచేసిన దొర ఇండియన్‌ ఒలింపిక్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. రచయితగా.. ‘జర్నీ థ్రూ టర్బులెంట్‌ టైమ్స్‌’, ‘ఎన్టీఆర్‌తో నేను’ అనే పుస్తకాలు రాశారు.

సీఎం చంద్రబాబు సంతాపం

ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన మృతి దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. ఏపీ పోలీసుకు బ్రాండ్‌ క్రియేట్‌ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఎన్టీఆర్‌ దగ్గర ఇంటెలిజెన్స్‌ అధికారిగా, నా హయాంలో రాష్ట్ర డీజీపీగా దొర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. నాడు రాష్ట్రాన్ని పట్టిపీడస్తున్న నక్సల్స్‌ సమస్య పరిష్కారంలో హెచ్‌జే దొర ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారు.’ అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ కూడా దొర మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

Updated Date - Mar 14 , 2026 | 04:49 AM