Share News

నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:56 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు కన్ను మూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో నాదెండ్ల భాస్కర్‌రావు నెల.......

నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

  • వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస

  • పార్థివ దేహాన్ని సందర్శించిన పలువురు నేతలు, సంతాపం.. నేడు అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌, ఖమ్మం, తెనాలి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు కన్ను మూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో నాదెండ్ల భాస్కర్‌రావు నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం ఆరోగ్యం విషమించడంతో ఉదయం 11.45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. గురువారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల భాస్కర్‌రావు పార్థివదేహానికి మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తదితరులు నివాళులు అర్పించారు. నాదెండ్ల భాస్కర్‌రావు మరణం పట్ల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు. కాగా, నాదెండ్లకు చికిత్సను అందించిన కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ వ్యవస్థాపకులు, చైర్మన్‌ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి.. చికిత్స కొనసాగుతున్న సమయంలో నాదెండ్లతో పలుమార్లు సంభాషించానని, ఆధ్యాత్మికంతోపాటు పలు అంశాలపై ఆయన అభిప్రాయాలు విలువైనవని తెలిపారు.

సాధారణ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి..

ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడిలో నాదెండ్ల పిచ్చియ్య, వెంకాయమ్మ దంపతులకు 1935 జూన్‌ 23న నాదెండ్ల భాస్కరరావు జన్మించారు. స్థానికంగా విద్యాభ్యాసం అనంతరం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వెళ్లారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎ్‌సజీడీ పట్టాలు పొందారు. హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్‌ ప్రారంభించారు. లాయర్‌ వృత్తిలో ఉంటూనే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1966లో అఖిల భారత యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా పని చేశారు. 1977లో రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1978లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పదవిని చేపట్టారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం నమోదు చేసి ఎన్టీఆర్‌ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


నాదెండ్ల ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో ఎన్టీఆర్‌ అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో.. కాంగ్రెస్‌ మద్దతుతో నాదెండ్ల తిరుగుబాటు చేసి సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబరు 16వ తేదీ వరకు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్టీఆర్‌ తిరిగి వచ్చాక భారీ ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించటంతో నాదెండ్ల సీఎం పదవి నుంచి దిగిపోక తప్పలేదు. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో నాదెండ్ల చేరారు. 1989లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా, 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో బీజేపీలో చేరినా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ‘వాకింగ్‌ విత్‌ డెస్టినీ’ పేరుతో ఆయన ఆత్మకథ వెలువడింది. భాస్కరరావుకు ఇద్దరు కుమారులు. మురళీధర్‌, మనోహర్‌. నాదెండ్ల మనోహర్‌ ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీలో కీలకనేతగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

తెనాలితో అనుబంధం: భాస్కరరావు ప్రాథమిక విద్య బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి, భట్టిప్రోలు మండలం వెల్లటూరులో 9వ తరగతి వరకు కొనసాగింది. పదో తరగతి పరీక్షలు మాత్రం కొల్లూరు జడ్‌పీ ఉన్నత పాఠశాలలో రాశారు. ఆ తర్వాత మచిలీపట్నంలో చదివి, ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వెళ్లారు. ఆయన మరణ వార్త తెలియటంతో తెనాలిలో విషాదం నెలకొంది. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

మనోహర్‌కు ఫోనులో బాబు పరామర్శ

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. భాస్కరరావు తనయుడు, మంత్రి నాదెండ్ల మనోహ ర్‌కు ఫోన్‌ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యు లకు తన సానుభూతి తెలిపిన చంద్రబాబు, భాస్క రరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి లోకేశ్‌ కూడా నాదెండ్ల భాస్కరరావు మృతికి సంతాపం తెలియజేశారు.

డిప్యూటీ సీఎం పవన్‌ సంతాపం

నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కుమారుడు, సహచర మంత్రి మనోహర్‌ పితృ వియోగం బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Updated Date - Apr 23 , 2026 | 03:56 AM