Share News

అటవీశాఖ ఆంక్షలు

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:02 AM

నల్లమలలోని నాగార్జునసాగర్‌-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో జరుగుతున్న అఖిల భారత పులుల గణన-2026 నేపథ్యంలో శ్రీశైలానికి కాలినడకన తరలివెళ్లే భక్తులకు అటవీశాఖ పలు ఆంక్షలు విఽధించింది.

   అటవీశాఖ ఆంక్షలు
మాట్లాడుతున్న ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌అప్పావ్‌ మల్లన్న భక్తులకు

దేశవ్యాప్త పులుల లెక్కింపుతో నిబంధనలు

ఫిబ్రవరి 8 నుంచి 13 వరకు కాలినడక భక్తులకు అనుమతి

ఆత్మకూరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): నల్లమలలోని నాగార్జునసాగర్‌-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో జరుగుతున్న అఖిల భారత పులుల గణన-2026 నేపథ్యంలో శ్రీశైలానికి కాలినడకన తరలివెళ్లే భక్తులకు అటవీశాఖ పలు ఆంక్షలు విఽధించింది. ఈ మేరకు మంగళవారం ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌అప్పావ్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరిగే పులుల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఎనఎస్‌టీఆర్‌ పరిధిలో జనవరి 3 నుంచి 31వ తేది వరకు ఫేస్‌-3 దశలో కెమెరా ట్రాప్స్‌ ద్వారా పులుల గణన ప్రక్రియను చేపడుతున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా తొలిబ్లాక్‌లో ఎంపిక చేయబడిన ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజుల పరిధిలో ఫిబ్రవరి 13వ తేది వరకు పులుల గణన ప్రక్రియ జరుపుతున్నట్లు చెప్పారు. అయితే ఇదే సమయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లమల అటవీ మార్గం మీదుగా భక్తులు కాలినడకన వెళ్లనున్న నేపథ్యంలో శాస్ర్తీయ పద్దతిలో జరగుతున్న పులుల గణాంకాల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు తాత్కాలికంగా పలు ఆంక్షలను విధిస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వెంకటాపురం నుంచి పాదయాత్రగా వెళ్లే భక్తులకు కేవలం ఫిబ్రవరి 8 నుంచి 15వ తేదీ వరకు మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు. మిగతా రోజుల్లో దోర్నాల మీదుగా రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మల్లన్న భక్తులు గమనించి పులుల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా జరిపేందుకు సహకరించాలని కోరారు.

ఎనఫోర్స్‌మెంటు బృందాల ఏర్పాటు

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): సరిహద్దు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి అక్రమంగా పెట్రోలియం రవాణా కాకుండా కట్టడి చేయడానికి ఎనఫోర్స్‌మెంటు బృందాలను ఏర్పాటయ్యాయి. మంగళవారం తన చాంబరులో అక్రమ పెట్రోలియం రవాణాపై ఎనఫోర్స్‌మెంటు ప్రొటెక్షన కమిటీతో జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశలోకి అక్రమంగా అనుమతి లేకుండా పెట్రోలియం తరలించి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. కర్ణాటకలో ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇలా చేస్తున్నారనీ దీనివల్ల రాష్ట్రానికి పన్ను ఆదాయం తగ్గడమే కాకుండా సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. దీనిని అరికట్టడానికి సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు జాయింట్‌ ఎనపోర్స్‌మెంటు కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంబంధిత కమిటీలో రవాణాశాఖ, లీగల్‌ మెట్రాలజీ శాఖ, సివిల్‌ సప్లైస్‌ శాఖ, కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖలు నాలుగు విబాగాలుగా కలిసి పని చేస్తాయన్నారు. ఈ బృందాలు సంయుక్తంగా వారానికి రెండుసార్లు తనిఖీలు నిర్వహించాలని జేసీ ఆదేశించారు. లీగల్‌ మెట్రాలజీ వారు స్టాంపింగ్‌, కాలిబ్రేషన సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలన్నారు. ఏవైనా అక్రమాలు జరిగితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీటీసీ శాంతకుమారి, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు, లీగల్‌ మెట్రాలజీ అధికారులు, ఆయిల్‌ కంపెనీ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 12:02 AM