డయాఫ్రం వాల్ వేగంగా కట్టారు
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:51 AM
పోలవరం ప్రాజెక్టులో అతిముఖ్యమైన డయాఫ్రం వాల్‌ను ఇంత వేగంగా నాణ్యతతో ఎలా కట్టగలిగారని విదేశీ నిపుణులు ఆరా తీశారు.
డీఎస్‌ఎం అవసరం లేదు: విదేశీ నిపుణులు
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అతిముఖ్యమైన డయాఫ్రం వాల్‌ను ఇంత వేగంగా నాణ్యతతో ఎలా కట్టగలిగారని విదేశీ నిపుణులు ఆరా తీశారు. పోలవరం కాంట్రాక్టు సంస్థను, జల వనరులశాఖ అధికారులను అంతర్జాతీయ నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మంగళవారం డయాఫ్రమ్‌వాల్ చెరివైపులా డీప్ సోయిల్ మిక్సింగ్ (డీఎ్‌సఎం) చేయాలని పట్టుబట్టిన పీవోఈ సభ్యుడు.. బుధవారం సాంకేతికంగా కొద్దిపాటి సలహాలను ఇచ్చారు. డీఎ్‌సఎం అవరసరం లేదని తేల్చి చెప్పారు. దీంతో.. జల వనరులశాఖ అధికారులు, డిజైన్‌లను రూపొందిస్తున్న ‘ఆఫ్రీ’ సంస్థ ఊపిరి పీల్చుకున్నాయి. ప్రాజెక్టు ప్రాంతంలో డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి.సిక్కో (అమెరికా), సీస్ హించ్‌బెర్జర్ (కెనడా) మూడోరోజు బుధవారం కూడా పర్యటించారు. ప్రధానంగా డయాఫ్రం వాల్, గ్యాప్-1, గ్యాప్-2 పనులను, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. కొన్నిచోట్ల శాంపిళ్లు కూడా తీసుకున్నారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్(ఈసీఆర్‌ఎఫ్) డ్యాం రోలింగ్ విషయంలో ప్రస్తుతం జలవనరుల శాఖ అధికారులు వినియోగిస్తున్న ఫ్లాట్ ఫుట్, వైబ్రేటెడ్ ఫుట్ రోలింగ్ పద్ధతులు ఆమోదయోగ్యమేనని నిపుణులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ క్లే కోర్ ప్రాంతాల్లో మాత్రం షీఫ్ ఫుట్ రోలర్లు వినియోగించాలని సూచించారు. అనంతరం క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌ల్లో నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారనే అంశాలను స్వయంగా పరిశీలించి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో వేగం, నాణ్యతా ప్రమాణాలపై నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ పనుల డాక్యుమెంటేషన్‌లో వరుస క్రమాన్ని పాటించలేదని అభిప్రాయపడ్డారు. బుధవారంతో ప్రాజెక్టు ప్రాంతంలో వారి పర్యటన ముగిసింది. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ భక్షి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చీఫ్ ఇంజనీర్ ఎం.రమేశ్‌కుమార్ అధ్యక్షతన సమావేశమై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. గురువారం బొమ్మూరులో పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌తో వారు సమావేశమై.. అనంతరం ఢిల్లీ వెళ్తారు. శుక్రవారం పీపీఏ సీఈవో యోగేశ్ పైథాంకర్, కేంద్ర జలసంఘం చైర్మన్‌తో భేటీ అవుతారు. అనంతరం తమ నివేదికను జలసంఘానికి పంపుతారు. పర్యటనలో వారి వెంట కేంద్ర జలసంఘంఅధికారులు పాల్గొన్నారు.